జిఎస్టీ తగ్గే అవకాశం, కానీ: జైట్లీ, భారం అందరూ మోయాల్సిందే
న్యూఢిల్లీ: భవిష్యత్తులో జీఎస్టీ స్లాబ్ రేట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో 27వ బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ ఆఫీసర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ప్రభుత్వ ఆదాయం పెరగగానే జీఎస్టీ (వస్తు-సేవల పన్ను) కింద తక్కువ పన్ను శ్లాబుల్ని తీసుకువచ్చే అవకాశముందని జైట్లీ తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి కొన్ని నెలలే అయిందని, ఈ రోజుకు ఉన్న పరిస్థితిని చూస్తే ఆదాయం పెరగడానికి అవకాశం ఎక్కువే ఉందన్నారు.

పన్ను భారాన్ని తగ్గించడానికి కొన్ని మార్పులు
చిన్నచిన్న చెల్లింపుదారులపై పన్ను భారాన్ని తగ్గించడానికి కొన్ని మార్పులు అవసరమని జైట్లీ చెప్పారు. ఆదాయపరంగా నష్టం లేని స్థితికి చేరుకుంటే తక్కువ పన్నులుంటే శ్లాబుల్ని ప్రవేశపెట్టడం వంటి పెద్ద సంస్కరణల గురించి ఆలోచించవచ్చునని చెప్పారు.

చిన్న ట్యాక్స్ పేయర్లకు భారం తగ్గించేందుకు
అలా జరగాలంటే ముందుగా మనం రెవెన్యూపరమైన తటస్థత సాధించాలని జైట్లీ అన్నారు. ఇంకా జీఎస్టీని మెరుగుపరచుకోవడానికి ఎంతో స్కోప్ ఉందని చెప్పారు. చిన్న టాక్స్ పేయర్లకు భారం తగ్గించడం కోసం ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు.

అప్పుడు స్లాబ్ రేట్లను తగ్గించడం..
జీఎస్టీ తర్వాత దేశం ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకున్నాక, అప్పుడు స్లాబ్ రేట్లను తగ్గించడం లాంటి పెద్ద పెద్ద సంస్కరణను కేంద్ర ప్రభుత్వం చేపట్టే అవకాశముందని జైట్లీ అన్నారు.

పరోక్ష పన్ను భారం అందరూ భరించాలి
పరోక్ష పన్నుల భారాన్ని సమాజంలోని అన్ని వర్గాలూ భరించాల్సి ఉంటుందనీ, ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువులపై పన్ను రేట్లను తగ్గించాలనేదే ప్రభుత్వ ప్రయత్నమని జైట్లీ చెప్పారు. ప్రత్యక్ష పన్నుల భారం బలహీన వర్గాలపై కచ్చితంగా ఉండదనీ, పరోక్ష పన్నుల విషయంలో మాత్రం అందరిపైనా భారం తప్పదన్నారు.

ఆ హక్కుతో పాటు ఈ హక్కు కూడా
సంప్రదాయకంగా మనది పన్నులు చెల్లించడానికి ఒప్పుకోని సమాజమని, అభివృద్ధి జరగాలని డిమాండ్ చేసే హక్కు ఉన్నట్లే ఆ అభివృద్ధికి అవసరమైన మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యతా ప్రజలపై ఉందని, పాలనకు, అభివృద్ధి కార్యకలాపాలకు రెవెన్యూయే జీవన రేఖ అని జైట్లీ చెప్పారు. పన్ను చెల్లింపుదారుల్లో భయం కలిగించడం కాకుండా వారి నుంచి గౌరవం పొందే విధంగా వ్యవహరించాలని అధికారుల్ని ఆయన కోరారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!