బీజేపీకి బిగ్ డే: ఒక చోట కోరస్ - మరో చోట సస్పెన్స్..!!
అహ్మదాబాద్/సిమ్లా: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీకి బిగ్ డే. ప్రస్తుతం అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇంకాస్సేపట్లో ఎన్నికల కౌంటింగ్ మొదలు కాబోతోంది. తొలి రెండు గంటల్లోనే ట్రెండ్ తేలిపోనుంది. ఈ నెల 5వ తేదీన గుజరాత్‌లో రెండో దశ పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ వాస్తవ రూపాన్ని దాల్చుతాయా? లేదా? అనేది తేలిపోనుంది.
గుజరాత్‌లో రెండు దశల్లో పోలింగ్ ముగిసింది. మొత్తం 33 జిల్లాల్లోని 182 అసెంబ్లీ స్థానాలు ఈ నెల ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 89, రెండో విడతలో 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఈ రెండు చోట్ల కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం చూసుకుంటే - గుజరాత్‌లో ఓటర్లు వార్ వన్ సైడ్ చేసినట్టే కనిపిస్తోంది. మరోసారి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా తేలింది.

గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 92. దీన్ని అవలీలగా బీజేపీ అందుకుంటుందనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం టఫ్ ఫైట్ ఉండొచ్చు. హిమాచల్‌లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో అధికారం పొందాలంటే కావాల్సిన సంఖ్యాబలం 35.
ఈ ఫిగర్‌ను అందుకోవడంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో - ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. గుజరాత్‌లో కాంగ్రెస్ గానీ, ఆమ్ ఆద్మీ పార్టీ గానీ పెద్దగా ప్రభావం చూపట్లేదు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ- ఆప్ మాత్రం అధికారాన్ని ఆమడదూరంలో నిలుస్తందనేది ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జెండా ఎగరేసిన చీపురు పార్టీ- గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌పైనా ఆశలు పెట్టుకుంది. అవి ఎంతవరకు ఫలిస్తాయనేది ఈ సాయంత్రానికి తేలిపోనుంది.












Click it and Unblock the Notifications