మోడీ, షాకి కోర్టులో ఊరట: స్నూప్‌గేట్ విచారణ రద్దు
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు శుక్రవారం గుజరాత్ హైకోర్టులో ఊరట లభించింది. గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దుమ్మెత్తిపోసిన స్నూప్‌గేట్ వివాదానికి సంబంధించిన కేసులో విచారణను గుజరాత్ హైకోర్టు నిలిపివేయాలని ఆదేశించింది.
2009లో గుజరాత్ పోలీసులు ఓ మహిళపై అక్రమంగా నిఘా ఉంచారన్న వివాదంపై ఈ కేసు నడుస్తోంది. కాగా, ఆ మహిళ తండ్రి కేసు విచారణను ఆపేయాలని దీన్ని వ్యక్తిగత వ్యవహారంగా పరిగణించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‍పై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఆ మహిళ భద్రత కోసం వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు నిఘా ఉంచామని పలుమార్లు బిజెపి పేర్కొంది. 2009లో వివాదం జరిగిన సమయంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు.

రేపు లొంగిపోనున్న చౌతాలా
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా బెయిలును ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. హర్యానాలో ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాలాకు 10ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అనారోగ్యానికి గురవడంతో ఆయనకు మే నెలలో కోర్టు బెయిలు మంజూరు చేసింది.
అయితే ఆయన ప్రస్తుతం హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండటంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, ఆయన బెయిలును రద్దు చేయాలని సిబిఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, శుక్రవారం ఆయనను ఇక మీదట ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని, బెయిలు రద్దు చేస్తున్నందున జైలుకు వెళ్లాలని ఆదేశించింది.
ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో నిరుటి జనవరిలో ఓంప్రకాశ్ చౌతలాతోపాటు ఆయన కుమారుడు అజయ్, మరో 8మందికి పదేళ్ల జైలు శిక్ష పడింది.
ప్రధానిని కలువనున్న నోబెల్ గ్రహీత కైలాస్
2014కు గానూ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. బాలల హక్కుల ఉద్యమ కార్యకర్త అయిన కైలాస్ సత్యార్థికి నోబెల్ కమిటీ శుక్రవారం మధ్యాహ్నం శాంతి బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సత్యార్థి ప్రధానితో భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications