గుజరాత్‌లో యువ తరంగానిదే కీలకం: 65% మంది 35 ఏళ్లలోపు వారే

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే తారాస్థాయికి చేరుకున్నది. అనూహ్య పరిణామాలు, ఫిరాయింపులతో రాజకీయం రక్తికడుతోంది. మోదీ నెల రోజుల్లోపే నాలుగుసార్లు గుజరాత్‌లో పర్యటించారు. మరోవైపు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా క్షేత్రస్థాయిలో చురుగ్గా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. నవంబర్‌ - డిసెంబర్‌ నెలల్లో గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. గత 22 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీపై సాధారణంగానే జనంలో వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు మోదీ నేతృత్వం లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. 2002 నుంచి గుజరాత్‌ సీఎంగా మోదీ గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి హ్యాట్రిక్‌ విజయాలను అందించారు.
ఆయన ప్రధానిగా ఢిల్లీకి వెళ్లడంతో రాష్ట్రస్థాయిలో బీజేపీకి నాయకత్వ శూన్యత ఏర్పడింది. పటిష్ట నాయకత్వం కొరవడింది. వీటిని దృష్టిలో పెట్టుకునే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చాన్నాళ్ల ముందు నుంచే గుజరాత్‌పై దృష్టి కేంద్రీకరించి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రచించి.. అమలుకు పార్టీ శ్రేణులను పురమాయిస్తున్నారు. 182 స్థానాలు గలగుజరాత్‌ అసెంబ్లీలో వచ్చే ఎన్నికల్లో 150 పైచిలుకు స్థానాల్లో గెలవాలని లక్ష్యం నిర్దేశించారు.

అన్ని రకాల వ్యూహాలు అమిత్ షా అమలు

అన్ని రకాల వ్యూహాలు అమిత్ షా అమలు

కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన నాయకుడిగా పేరొందిన శంకర్‌సింఘ్ వాఘేలాను తిరుగుబాటుకు పురిగొల్పి, కాంగ్రెస్‌ వ్యూహకర్త అహ్మద్‌పటేల్‌ రాజ్యసభకు ఎన్నికవ్వకుండా అమిత్‌షా సర్వశక్తులూ ఒడ్డారు. కర్ణాటకలో గుజరాత్‌ ఎమ్మెల్యేల శిబిరాన్ని నిర్వహించిన మంత్రిపై ఆదాయం పన్ను శాఖ దాడులూ జరిగాయి. ఇతర పార్టీలకు భిన్నమని చెప్పుకునే బీజేపీ ఏది నైతికం, ఏది అనైతికమనేది చూడకుండా అన్ని ప్రయత్నాలూ చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బకొట్టి ఆ పార్టీ శ్రేణులను డీలాపడేలా చేయాలని చూశారు కమలనాథులు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన పొరపాటుతో వారి ఓట్లు చెల్లకుండాపోయి.. అహ్మద్‌పటేల్‌ అతికష్టం మీదైనా గెలిచి నిలువడంతో కమలనాథుల వ్యూహాలు ఫలించలేదు.

 ఇలా గోరక్షా పేరిట దళితుల ఆందోళన

ఇలా గోరక్షా పేరిట దళితుల ఆందోళన

మరోవైపు పాటిదార్లకు రిజర్వేషన్లు ఇస్తే తాము నష్టపోతామని ఓబీసీలు ఉద్యమించారు. వారి తరఫున ఆందోళనకు నాయకత్వం వహించిన ఓబీసీ ఏక్తా మోర్చా కన్వీనర్‌ అల్పేశ్‌ ఠాకూర్‌ను కాంగ్రెస్‌ తమ పార్టీలో చేర్చుకుంది. అలాగే గో రక్ష పేరిట ఉనాలో దళితులపై దాడుల నేపథ్యంలో ఆ వర్గం యువనేతగా ఎదిగిన జిఘ్నేష్‌ మేవానీకి రాహుల్‌ను కలవాల్సిందిగా కాంగ్రెస్‌ ఆహ్వానించినా కాంగ్రెస్‌ పార్టీలో చేరబోవడం లేదని స్పష్టం చేశారు. బీజేపీని ఓడించాలనే కృతనిశ్చయంతో ఉన్నానని చెప్పారు. దీన్నిబట్టి దళిత యువత మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందనేది స్పష్టమవుతోంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పాటిదార్లు, ఓబీసీలు ఉద్యమించినా, దాడుల నుంచి రక్షణ కోసం దళితులు ఆందోళన బాట పట్టినా బీజేపీకి వ్యతిరేకంగా కలసి పనిచేసే వారికి ఇప్పుడు కాంగ్రెస్‌ ఒక వేదికగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ‘ఖామ్ ‌(క్షత్రియులు, హరిజనులు, ఆదివాసీలు, ముస్లిం)' సమీకరణంతో గుజరాత్‌లో గెలిచేది. ఇప్పుడు వివిధ సామాజిక వర్గాల్లో బీజేపీపై గూడుగట్టుకున్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ కొత్త సమీకరణాలకు తెరతీస్తోంది. పాటీదార్లు - ఓబీసీలు - దళితులను ఏకం చేసి.. బీజేపీ హిందుత్వకు చెక్‌ పెట్టాలని వ్యూహరచన చేస్తోంది. హార్దిక్ పటేల్, అల్పోక్ ఠాకూర్, జిఘ్నేశ్ మేవానీ కూడా తమ సమస్యలతో సంబంధం లేకుండా ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పోరాడతామని చెప్తుండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గతంలో మాదిరిగా ముస్లింల గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ఎందుకంటే గుజరాత్‌లో పోటీ రెండు పార్టీల మధ్యే. ముస్లింలు బీజేపీకి ఓటేయరు కాబట్టి వారి మద్దతు ఎలాగైనా తమకే ఉంటుందని కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.

 పలుకుబడి గల ప్రముఖులకు మద్దతు

పలుకుబడి గల ప్రముఖులకు మద్దతు

బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిచిన్న గ్రూపును కలుపుకుని పోవడం ద్వారా ఓట్ల చీలికను నివారించాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నది. జేడీ(యూ)కు చెందిన చోటూభాయ్‌ వసావా ఆరుసార్లు ఎమ్మెల్యే. గిరిజనుల్లో పట్టున్న నేత. కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలతో కలసి పనిచేస్తానని ఆయన ప్రకటించారు. శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోని కొందరు ముఖ్యనేతలను కూడా కాంగ్రెస్‌ దువ్వుతోంది. పార్టీలో చేరకున్నా, స్వతంత్రంగా పోటీచేస్తే మద్దతిస్తామని కొంచెం పలుకుబడి ఉన్న నాయకులకు ఆఫర్లు ఇస్తోంది. తద్వారా బీహార్‌లో మహాకూటమి ఏర్పాటు ద్వారా సాధించిన ఫలితాన్ని గుజరాత్‌లోనూ పునరావృతం చేయాలని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. ఆ దిశగా ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. మోదీ స్వరాష్ట్రంలో ఆయన్ని ఓడిస్తే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు ఉంటాయనేది ఆ పార్టీ ఆశ పడుతున్నది.

హిందూత్వ, అభివృద్ధి మంత్రం

హిందూత్వ, అభివృద్ధి మంత్రం

హార్దిక్‌ పటేల్, అల్పేశ్‌ ఠాకోర్, జిఘ్నేశ్‌ మేవానీ ఆయా సామాజికవర్గ ప్రతినిధులే అయినా.. వీరికి యువతలో విపరీతమైన ఆదరణ ఉంది. కారణమేమిటంటే.. వీరు నవతరం ప్రతినిధులు. హార్దిక్‌కు 24 ఏళ్లు. జిఘ్నేష్‌కు 34 ఏళ్లు. అల్పేశ్‌ వయసు 39 ఏళ్లు. గుజరాత్‌ జనాభాలో ఏకంగా 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారే. ఈ యువనేతల జనాకర్షణ శక్తిని ఓట్లుగా మలుచుకుని లాభపడాలని కాంగ్రెస్‌ యత్నిస్తోంది. నిరుద్యోగ భృతి ఇస్తామని, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని హామీలు ఇస్తూ యువతను తమవైపు తిప్పుకునే యత్నం చేస్తోంది. ఇక రెండు దశాబ్దాల పైచిలుకు అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజావ్యతిరేకతను అధిగమించడం అంత సులువేమీ కాదు. సమాజంలోని వివిధ వర్గాల్లో బీజేపీపై తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ మళ్లీ హిందూత్వ కార్డును తెరపైకి తెస్తోంది. తాజ్‌మహల్‌పై యూపీ బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై నాయకుల ప్రకటనలను ఈ కోణంలోనే చూడొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 జీఎస్టీతో వాణిజ్య వర్గాలపై తడిసిమోపెడు

జీఎస్టీతో వాణిజ్య వర్గాలపై తడిసిమోపెడు

గుజరాత్‌లో అత్యంత ప్రాబల్యవర్గం వ్యాపారులు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ మూలంగా వీరు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టే ప్రధాని మోదీ.. దీన్ని అన్ని పార్టీల సమష్టి నిర్ణయమని చెప్పే తమ తప్పేమీ లేదని నమ్మించేందుకు ప్రయత్నించారు. అన్ని పార్టీలతో చర్చించామని, కాంగ్రెస్‌ కూడా జీఎస్‌టీని ఆమోదించిందని ఇటీవల గుజరాత్‌ పర్యటనలో నొక్కి చెప్పారు. అభివృద్ధి మంత్రం పఠించారు. గుజరాతీ ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు. కాంగ్రెస్‌కు గుజరాతీలంటే ఇష్టం లేదని పేర్కొంటూ ప్రధానిగా ఒక రాష్ట్ర నేత స్థాయిలో మాట్లాడారు. వీటిని బట్టి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా గుజరాత్‌ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చునంటున్నారు.

 పాటిదార్ల నేతగా హార్దిక్ పటేల్ ఇలా

పాటిదార్ల నేతగా హార్దిక్ పటేల్ ఇలా

వివిధ వర్గాల్లో బీజేపీపై నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. సామాజికంగా కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. అత్యంత ప్రాబల్యం కలిగిన పాటిదార్లను అక్కున చేర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. రెండేళ్ల కిందట విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కావాలని పాటిదార్లు తీవ్రంగా ఉద్యమించారు. దీనికి నేతృత్వం వహించిన ఫైర్‌బ్రాండ్‌ యువనేత హర్దిక్‌ పటేల్‌ పేరు మారుమోగింది. పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పాస్‌) నాయకుడిగా ఆ సామాజిక వర్గానికి ప్రతినిధిగా హార్దిక్‌ పటేల్‌ ఎదిగారు. హార్దిక్‌పై దేశద్రోహం నేరం మోపి జైల్లో పెట్టడం, గుజరాత్‌లోకి ప్రవేశించకుండా కోర్టు ఆరు నెలలపాటు నిషేధం విధించడంతో పాటిదార్లు బీజేపీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

 గుజరాత్‌లో పాటిదార్లు 14 శాతం

గుజరాత్‌లో పాటిదార్లు 14 శాతం

ఉద్యమ ఉధృతి తగ్గినా పాటిదార్లు రిజర్వేషన్ల కోసం తమ డిమాండ్‌ నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అవకాశం కోసం వేచి ఉన్న వీరు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం నేర్పాలని బహిరంగంగానే చెబుతున్నారు. గుజరాత్‌ జనాభాలో పాటిదార్లు 12 నుంచి 14 శాతం దాకా ఉంటారు. సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న ఈ వర్గం బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంది. ఇప్పుడు పాటీదార్లలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. హార్దిక్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తోంది. గుజరాత్‌ పర్యటనకు వచ్చిన రాహుల్‌ను కలవాలని హార్దిక్‌ను కాంగ్రెస్‌ ఆహ్వానించింది. ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఇప్పుడు కలవలేనని, రాహుల్‌ తర్వాతి గుజరాత్‌ పర్యటనలో ఆయన్ని కలుస్తానని హార్దిక్‌ తెలిపారు. పార్టీలో చేరడం కుదరకపోతే ఎన్నికల్లో మద్దతు తెలపాలని, కలసి పనిచేయాలని కాంగ్రెస్‌ కోరుతోంది. ప్రస్తుతం ఉన్న 49 శాతం రిజర్వేషన్ల జోలికి వెళ్లకుండా తాము అధికారంలోకి వస్తే తమిళనాడు తరహాలో పాటిదార్లతో కలిపి ఇతరులకు అదనంగా 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో చేరి తన ప్రత్యేక గుర్తింపును కోల్పోయే బదులు, సామాజికవర్గ ప్రయోజనాల కోసం పాటుపడుతూ ఉద్యమ నేతగా ఉండేందుకే హార్దిక్‌ మొగ్గుచూపుతున్నారు. పాటిదార్లను అవమానించిన బీజేపీని ఓడించేందుకు కృషి చేస్తానంటున్నారు.

 హార్దిక్ మద్దతుదారులతో కమలనాథులకు ఇబ్బందికర పరిస్థితులు

హార్దిక్ మద్దతుదారులతో కమలనాథులకు ఇబ్బందికర పరిస్థితులు

హార్దిక్‌ పటేల్‌ను తమవైపు తిప్పుకోవడం సాధ్యం కాదని గ్రహించిన కాషాయ పార్టీ.. ఆయన్ని బలహీనపర్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. హార్దిక్‌కు సన్నిహితులుగా పరిగణించే వరుణ్‌ పటేల్, రేష్మా పటేల్‌ను శనివారం బీజేపీలో చేర్చుకున్నది. వీరిద్దరూ హార్దిక్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్‌గా అభివర్ణించారు. ఆదివారం పాస్‌ ఉత్తర గుజరాత్‌ కన్వీనర్‌ నరేంద్ర పటేల్‌ను అక్కున చేర్చుకున్నది. బీజేపీలో చేరిన కొద్దిగంటల్లోనే ఆదివారం నరేంద్ర పటేల్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి సంచలనం సృష్టించారు. పార్టీలో చేరితే రూ.కోటి ఇస్తామని బీజేపీ ప్రలోభ పెట్టిందని, అడ్వాన్సు‌గా రూ.10 లక్షలు ఇచ్చిందని.. ఆ నగదును మీడియా ముందు ప్రదర్శించడంతో బీజేపీ ఒక్కసారిగా అవాక్కయ్యింది. ఇది కాంగ్రెస్‌ డ్రామాగా కొట్టిపారేసే యత్నం చేసింది. కొద్దిగంటల్లోనే 15 రోజుల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్న పాటీదార్‌ ఉద్యమనేత నిఖిల్‌ సవానీ.. బీజేపీ ప్రలోభాలకు నిరసనగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. హార్దిక్‌ ముఖ్య అనుచరులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్‌ ఆకర్ష్ చేపట్టిన బీజేపీ అనూహ్యంగా ఇది బెడిసికొట్టి.. తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With Assembly elections in Gujarat due later this year, the ruling Bharatiya Janata Party (BJP) and the Opposition Congress are leaving no stone unturned to ensure that they emerge victorious. This will be the first time elections are being held in Gujarat without Narendra Modi guiding the BJP ship, and a defeat for the saffron party will add credence to the theories doing the rounds that the state unit of the party is a sinking ship without the prime minister at the helm of affairs. Meanwhile, the Congress, which has suffered a series of electoral setbacks in recent months, is targetting Gujarat as the state which will revive its fortunes.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి