ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం, మరో నలుగురి పరిస్థితి విషమం!
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఓ భీకర రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అబురోడు-పాలన్‌పూర్ నేషనల్ హైవే 27పై అమీర్‌గఢ్ సమీపంలోని ఇక్బాల్‌గఢ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం ఎలా జరిగిందంటే?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 7.30 గంటల నుంచి 8 గంటల మధ్య ఓ మిని ట్రక్కు అదుపు తప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు ఉన్న రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఏడుగురు అక్కడికక్కడే మరణించగా.. కారులో చిక్కుకున్న వారిని జేసీబీ సాయంతో పోలీసులు వెలికితీశారు.

బాధితుల వివరాలు
మరణించిన వారిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరిలో ఆరుగురిని గుర్తించారు. మరణించిన వారు ప్రకాష్ కలవంత్ (36) - డ్రైవర్, ఫాల్నా (పాలి జిల్లా), మహమ్మద్ హుస్సేన్ - శివగంజ్ (సిరోహి జిల్లా), జిన్నత్ (హుస్సేన్ భార్య) - శివగంజ్ (సిరోహి జిల్లా), మహమ్మద్ షరీఫ్ - శివగంజ్ (సిరోహి జిల్లా), దీపక్ సింగ్ - అబురోడ్ (సిరోహి జిల్లా), మరో వ్యక్తి పిండ్వారా (సిరోహి జిల్లా) నివాసిగా గుర్తించారు. గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం పాలన్‌పూర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు రక్షణ చర్యలు చేపట్టారు. అమీర్‌గఢ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కారు రాజస్థాన్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉండటంతో బాధితులంతా రాజస్థాన్‌కు చెందిన వారిగా నిర్ధారించారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ల సహాయంతో వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.












Click it and Unblock the Notifications