హిందువుల పూజల కొనసాగింపుపై ఉత్కంఠత
Gyanvapi Mosque: చారిత్రాత్మకమైన వారణాశిలో గల జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారంలో ప్రతివాదులకు ఊరట లభించింది. ఈ మసీదులో పూజలను నిర్వహించడానికి హిందువులకు ఇచ్చిన అనుమతిని నిలిపివేయాలంటూ దాఖలైన పిటీషన్లను అలహాబాద్ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
జ్ఞాన్‌వాపి మసీదు దక్షిణ భాగం సెల్లార్‌లో గల వ్యాస్ కా ఠికానాలో రోజువారీ పూజాదికాలను నిర్వహించుకోవడానికి అవరమైన అనుమతులు ఇదివరకే హిందువులకు లభించిన విషయం తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, సుహృద్భావ వాతావరణంలో పూజలు జరుపుకోవడానికి జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లను చేసింది.

వారణాశి కోర్టు నుంచి ఆదేశాలు వెలువడిన 24 గంటల్లోనే మసీదులో పూజలు మొదలయ్యాయి. మసీదు బేస్‌మెంట్‌లో హిందు సంప్రదాయాల ప్రకారం.. పూజాదికాలు జరిగాయి. అర్చకులు మహా శివుడికి పూజలు చేశారు. ఘంటానాదాన్ని వినిపించారు. వేదమంత్రోచ్ఛారణలను జపించారు.
హిందువుల పూజలకు అనుమతి ఇస్తూ వారణాశి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్లింది జ్ఞాన్‌వాపి మసీదుకు చెందిన అంజుమన్ ఇంతెజామియా కమిటీ. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. మధ్యంతర స్టే ఇవ్వాలంటూ పిటీషన్‌ను దాఖలు చేసింది. వారణాశి కోర్టు ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలని అభ్యర్థించింది.
ఈ అప్పీల్ పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది అలహాబాద్ హైకోర్టు. దీన్ని లిస్టింగ్ చేసింది. ఈ నెల 12వ తేదీన విచారణ చేపడతామని వెల్లడించింది. అంజుమన్ ఇంతెజామియా కమిటీ తరఫు న్యాయవాది ఈ విషయాన్ని వెల్లడించారు. తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications