H-1B Appointment: ప్లీజ్ రావొద్దు..! మమ్మల్ని ఆదుకోండి..! తోటి భారతీయులే..!
ఈ నెలలో జరగాల్సిన హెచ్1బీ అపాయింటమెంట్లను వివిధ కారణాలతో అమెరికా ప్రభుత్వం రెండు నెలల పాటు వాయిదా వేయడంతో ఇక్కడికి వచ్చిన భారతీయులు చిక్కుకుపోయారు. దీంతో వీరి వీసాల్ని కూడా అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో హెచ్1బీ వీసా అపాయింట్ మెంట్ కోసం వచ్చి ఇలా చిక్కుకుపోయిన వారిలో ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై ఇంటర్నెట్ లో మిశ్రమ స్పందన వస్తోంది.
డిసెంబర్ లో భారత్ లో జరగాల్సిన హెచ్1బీ వీసా ఇంటర్వూల్ని వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలకు వాయిదా వేస్తున్నట్లు తాజాగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇక్కడే ఉండి అపాయింట్ మెంట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి పెద్ద షాక్ తగిలినట్లయింది. ఇందులో నుంచి వారు కోలుకోకముందే.. అమెరికాలో ఉంటూ జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్ మెంట్లు ఫిక్స్ చేసుకుంటున్న వారితో వీరు పోటీ పడాల్సిన రావడం మరో షాక్ గా మారుతోంది. దీంతో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలకు లేదా ఆ తర్వాత హెచ్-1బీ వర్క్ వీసాలు కలిగి ఉన్న వందలాది మంది భారతీయ నిపుణులు భారత్ లో చిక్కుకుపోయారు.

ఈ నేపథ్యంలో రెడ్డిట్ లో ఇలాంటి ఓ బాధిత యూజర్ అమెరికాలో ఉన్న తన తోటి భారతీయులకు చేసిన ఓ అభ్యర్ధన వైరల్ అవుతోంది. హెచ్1బీ వీసా పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ, దీనిని "స్కామ్" లేదా "అమెరికన్ కార్మికుల హక్కులను దుర్వినియోగం చేసే, హాని చేసే కార్యక్రమంగా భావిస్తున్న ట్రంప్ మద్దతుదారులకు ఇది సంతోషపెట్టి ఉండొచ్చని తెలిపారు. కానీ ఇది భారతీయ సమాజంలో ఐక్యతను తెస్తోందన్నారు.

"తోటి భారతీయులారా, మీరు అమెరికాలో ఉండి జనవరి/ఫిబ్రవరి నెలలకు హెచ్-1బీ అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకున్నట్లయితే లేదా బుక్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, దయచేసి, బుకింగ్ చేసుకోవద్దు. లేదా దయచేసి మీ బుక్ చేసిన అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసుకోండి. దయచేసి ఇక్కడ చిక్కుకుపోయిన మాకు అమెరికాలోని మా ఉద్యోగాలకు తిరిగి రావడానికి అవకాశం ఇవ్వండి. మేమంతా తీవ్ర ఒత్తిడికి గురయ్యాం. మా కుటుంబాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. జనవరి , ఫిబ్రవరిలో స్లాట్లు తెరిచే వరకూ వేచి చూడటం తప్ప మాకు వేరే మార్గం లేదు" అని సదరు రెడ్డిట్ యూజర్ తెలిపారు. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications