అంతు చూస్తా: అణగదొక్కేందుకు కుట్ర, జయలలిత మేనకోడలు దీపా
చెన్నై: మేనత్త వారసురాలిగా నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టనివ్వకుండా ఇది వరకు ఒత్తిడి తెచ్చారు, ఇప్పుడు నన్ను పూర్తిగా అణగదొక్కేందుకు కుట్రలు చేస్తున్నారని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను తగ్గే ప్రసక్తే లేదని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా స్పష్టం చేశారు. ప్రజలు, అన్నాడీఎంకే కేడర్ నిర్ణయం మేరకే తాను నిర్ణయాలు తీసుకుని ముందుకు వెలుతున్నాని ప్రకటించారు.
ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు తగ్గ పర్యటనలను తాను సిద్దం చేసుకుంటున్నానని దీపా అన్నారు. ఇక దీపా పేరవైకి తానే కార్యదర్శిగా ఉంటానని ఆమె తన అభిమానులకు చెప్పారు. ఇంత కాలం రాజకీయాల్లోకి అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని దీపా అన్నారు.

ఇప్పుడేమో తనను అణగదొక్కేందుకు పక్కా ప్లాన్ వేస్తున్నారని దీపా ఆరోపించారు. శశికళకు వ్యతిరేకంగా తనను రాజకీయాల్లోకి రావాలని అన్నాడీఎంకే పార్టీ కేడర్ బలవంతం పెట్టిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే అన్నారు.
అన్నాడీఎంకే క్యాడర్ కోసం తాను శశికళకు వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని దీపా అన్నారు. అందు కోసమే తాను ఎంజీఆర్, అమ్మ, పేరవైగా తన రాజకీయ పార్టీని స్థాపించానని దీపా జయకుమార్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం దీపా పేరవై కమిటి, పేరవై కార్యవర్గ సభ్యుల పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వివరిస్తామని దీపా జయకుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications