Haryana: కాంగ్రెస్‌కు కేజ్రీ దెబ్బ..కామన్ మ్యానే అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్..?
Haryana assembly election 2024:హర్యానాలో తమ గెలుపుపై కాంగ్రెస్‌కు అనుమానాలున్నాయా..? గెలుస్తామో లేదో అన్న భయం నెలకొందా..? కాంగ్రెస్ ఇంతలా భయపడటానికి కారణం ఎవరు..? బీజేపీని ఈ ఎన్నికల్లో కొట్టి అధికారం చేజిక్కించుకోవాలంటే కాంగ్రెస్ మెట్టు దిగక తప్పదా..? కాంగ్రెస్ విజయాన్ని ఎవరు అడ్డుకునే అవకాశం ఉంది..?
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఈసారి హర్యానాలో తమ విజయం నల్లేరుపై నడకే అని కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆపార్టీలో గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి. హర్యానాలో కాంగ్రెస్ విజయానికి శాపంలా మారింది ఆమ్ ఆద్మీ పార్టీ. నిన్న మొన్నటి వరకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కూటమితో కలిసి వస్తుందని.. దీంతో ఇండియా కూటమి గెలుపు తథ్యమని భావించారు. కానీ సీట్ల పంపకాల విషయంపై జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కథ మొదటికి చేరింది.

సీట్ల పంపకాల్లో...
హర్యానా అసెంబ్లీ సీట్ల కోసం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య జరిగిన చర్చల్లో భాగంగా కేజ్రీ పార్టీ అధిక సీట్లను తమకు కేటాయించడమే కాకుండా అందులో కొన్ని ప్రధాన నియోజకవర్గాలను ఇవ్వాలనే డిమాండ్ కాంగ్రెస్ ముందు ఉంచింది. అయితే దీనికి కాంగ్రెస్ ససేమిరా అని చెప్పడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగేందుకు డిసైడ్ అయ్యింది. 2019లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసిన 46 స్థానాల్లో ఒక్క స్థానం కూడా గెలవకపోవడం,పైగా 1శాతం కంటే తక్కువగా ఓట్లు రావడాన్ని కాంగ్రెస్ సాకుగా చూపిస్తోంది. అయితే అప్పటి ఆమ్ ఆద్మీ పార్టీ కాదని ఇప్పుడున్నది బలమైన ఆమ్ ఆద్మీ పార్టీ అనే విషయాన్ని కాంగ్రెస్ మరిచిపోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే నువ్వా నేనా అన్న రేంజ్‌లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ వ్యతిరేక ఓటును తనవైపు మరల్చుకునే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే కాంగ్రెస్ కలలు బూడిదలో పోసిన పన్నీరులా మిగిలిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.కచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీలుస్తుందని తద్వారా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ భయానికి కారణం అవుతోంది.
కేజ్రీవాల్ జైలు ఎపిసోడ్ పై సింపతీ
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండి విడుదల కావడం, ఆ తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయడం వంటి అంశాలు కచ్చితంగా హర్యానా ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి.ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హర్యానాలో ఇదే అంశాన్ని లేవనెత్తుతూ సానుభూతి పొందుతూ ప్రజల మద్దతును మూటగట్టుకుంటున్నారు. ఇంకా ఎన్నికల ప్రచారం షెడ్యూల్ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, ఆప్ నేతలు మాత్రం కొన్ని వ్యూహాత్మక నియోజకవర్గాల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అక్కడ బీజేపీని ఎండగట్టేందుకు కేజ్రీవాల్ సన్నద్ధమవుతున్నారు. కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఆ పార్టీని చిన్న చూపు చూసింది. 1శాతం ఓటుతో పెద్దగా ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయంతో ఉంది. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ రంగంలోకి దిగుతుండటంతో కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
హర్యానాలో ఆప్ పార్టీకి పెద్దగా ఆదరణ లేదని చెబుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత బీరేందర్ సింగ్ చౌదరీ. అయితే ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతవరకైనా వెళ్లే సాహసం చేస్తుందని అన్నారు. కానీ ఈ మంత్రం పనిచేయదని, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో ఇలాంటివి చాలా చేసి విఫలమైందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గేమ్ ప్లాన్
హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సానుభూతి పొందేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసింది. ముందుగా అరవింద్ కేజ్రీవాల్ జైలు ఎపిసోడ్, ఆ తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యింది. ఇక అరవింద్ కేజ్రీవాల్ దంపతులు ప్రచారం నిర్వహించనున్నారు. వీరితో పాటు పలువురు స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం సందర్భంగా ప్రతి గడపను తొక్కనున్నారు.ఇక కేజ్రీవాల్ సొంత గ్రామం హర్యానాలోని భివానీ జిల్లాలో ఉన్న సివానీ గ్రామం. తాను హర్యానా పుత్రుడని చెప్పుకునే అవకాశం ఉంది. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు గ్రామీణ అటు పట్టణ ప్రాంత ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు 1.80 లక్షల మంది వాలంటీర్లను నియమించుకుంది.
2019లో హర్యానాలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటమి పాలైన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునే క్రమంలో వేగంగా పావులు కదిపింది. పార్టీ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది.ప్రతి వార్డు పై దృష్టి కేంద్రీకరించిన పార్టీ ఓటర్లను మేనేజ్ చేసేందుకు వాలంటీర్లను నియమించింది.దీంతో కేజ్రీవాల్ పార్టీ ఒక్కింత బలపడిందనే చెప్పాలి. ఈ సారి మొత్తం 90 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్‌కు సవాల్ విసురుతోంది.
ఆప్ ఎంట్రీతో కాంగ్రెస్‌కు 9 జిల్లాల్లో నష్టం
ఇక ఢిల్లీలో, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాపై కన్నేసింది. హర్యానాలోని 9 జిల్లాల్లో సత్తా చాటే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్‌కు శరాఘాతంలా మారింది. ఈ 9 జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.ఈ నియోజకవర్గాలు ఢిల్లీ పంజాబ్ సరిహద్దుల్లో ఉండటం కలిసొచ్చే అంశం.ఈ జిల్లాల్లో మెజార్టీగా సిక్కు జనాభా ఉంది.మరోవైపు బీజేపీ కూడా హర్యానాపై గట్టిగానే ఫోకస్ పెట్టింది.అయితే కేజ్రీవాల్ ప్రచారం ఎంత గట్టిగా ఉంటే అంత ఎక్కువగా బీజేపీకి కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఆప్‌కు మద్దతు పెరుగుతుండగా..బీజేపీపై కూడా తక్కువ స్థాయిలో వ్యతిరేకత ఉందనే అంశాన్ని గమనించాలని చెబుతున్నారు.
ఇక బీజేపీ వ్యతిరేక ఓటు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మరలకుండా తమ వైపు తిప్పుకునే సవాలు కాంగ్రెస్ ముందుంది.ముఖ్యంగా పంజాబ్ ఢిల్లీ సరిహద్దులో ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆమ్ ఆద్మీకి ఆదరణ ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి కేజ్రీవాల్ ప్రచారంలో ఎమోషన్స్ ఎంత బాగా పండుతుందనే దానిపైనే కాంగ్రెస్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. అంతేకాదు అవి ఏ మేరకు ఓట్లుగా కన్వర్ట్ అవుతాయనేది మరో ప్రశ్నగా ఉంది.












Click it and Unblock the Notifications