హర్యానా ఎన్నికలు: ప్రచార బరిలోకి దిగనున్న రాక్ స్టార్
న్యూఢిల్లీ: 'లుంగీ డ్యాన్స్' పాటతో యావత్ ప్రపంచం మొత్తాన్ని ఊర్రూతలూగించిన యో యో హానీసింగ్ మరో కొత్త పాత్రలో కనిపించనున్నాడు. హర్యానాలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ తరుపున ప్రచారం చేయనున్నాడు.
హర్యానా ఎన్నికల ప్రచారంలో తమ పార్టీకి మద్దతుగా యో యో హానీసింగ్ పాల్గొంటారని ఆ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు కరణ్ చౌతాలా మీడియాకు చెప్పారు.

అవినీతి ఆరోపణల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓం ప్రకాశ్ చౌతాలా బెయిల్‌పై బయటకు వచ్చి పార్టీ తరుపున ప్రచారంలో పాల్గోంటారని పార్టీ నేతలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి నాలుగు సార్లు ఓం ప్రకాశ్ చౌతాలా ముఖ్యమంత్రిగా పనిచేశారు.
1999-2000 సంవత్సరంలో 3206 మంది జూనియర్ ఉపాధ్యాయుల నియామకంలో భారీ అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగం నిరూపణ కావడంతో స్పెషల్ సీబీఐ కోర్టు చౌతాలకు, ఆయన కుమారుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలా మరో 53 మందిని ఉపాధ్యాయ అక్రమ నియామక కేసులు దోషులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. హర్యానా రాష్ట్రంలో అక్టోబర్ 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications