పరువు హత్యలు: పశ్చాత్తాపం లేదన్న యువతి తండ్రి
రోహతక్: పరువు హత్య విషయంలో తాము ఎలాంటి పశ్చాత్తాపం చెందడం లేదని, తమ కుటుంబ పరువును మంటగలిపినందునే తాము వారికి అలాంటి శిక్ష విధించామని హర్యానా పరువు హత్య కేసులో తండ్రి, ఇతరులు పోలీసుల ఎదుట చెప్పారు. దానికి తమను శిక్షించినా పర్వాలేదన్నారు.
హర్యానా రాష్ట్రంలోని ఘర్నవతి గ్రామంలో బుధవారం దారుణ సంఘటన జరిగిన విషయం తెలిసిందే. నిధి, ధర్మేంద్ర అనే యువతీ యువకులు ప్రేమించుకోవడంతో వారిని అమ్మాయి తల్లిదండ్రులు హత్య చేశారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో నిధి, ధర్మేంద్రలు మంగళవారం ఢిల్లీకి పారిపోయారు. నిధి ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని కాగా, ధర్మేంద్ర టెక్నికల్ కోర్సు చేస్తున్నాడు.

తాము ఏ విధమైన హాని తలపెట్టబోమని నిధి కుటుంబ సభ్యులు హామీ ఇవ్వడంతో వారు తిరిగి గ్రామానికి వచ్చారు. నిధి ఇంటిలో ప్రేమ జంటను గంటల తరబడి హింసకు గురి చేశారని పోలీసులు అంటున్నారు. అమ్మాయిని ప్రజల సమక్షంలో చంపేశారు. అబ్బాయిని ఘోరంగా కొట్టారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. తల నరికారు. శవాన్ని గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో పడేశారు.
పోలీసులు వచ్చేసరికి అమ్మాయి శవానికి అంత్యక్రియలు చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. సగం కాలిన అమ్మాయి శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తండ్రి పశ్చాత్తాపం చెందడం లేదని చెప్పడం గమనార్హం. మరోవైపు ఈ హత్య కేసులో నిందితులందర్నీ అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖాప్ పంచాయతీలకు శిక్షించే హక్కు లేదని, అలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, దిక్తత్ ఖాప్ పంచాయతీ ప్రకారం ఒకే గ్రామం వారు, కమ్యూనిటీ వారు పెళ్లి చేసుకోవద్దు.












Click it and Unblock the Notifications