అజ్ఞాతం తెచ్చిన మార్పు: మారిపోయిన రాహుల్, సోనియా గర్వం
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మారిపోయారు! దాదాపు రెండు నెలల అజ్ఞాతం తర్వాత బయటకు వచ్చిన రాహుల్ గాంధీలో చాలా తేడా కనిపిస్తోందని అంటున్నారు. గతంలో వలె అస్పష్టమైన మాటలు, తడుముకోవడం వంటివి తగ్గావని చెబుతున్నారు. మొన్న కిసాన్ ర్యాలీలో, నేడు పార్లమెంటు సమావేశాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారని, గతంలో కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
దాదాపు రెండు నెలల పాటు అజ్ఞాతంలో ఉన్న రాహుల్ గాంధీ యోగాతో మమేకమయ్యారనే ఊహాగానాలు వినిపించాయి. అది ఆయనను మార్చేసిందని చెబుతున్నారు. కొత్త రాహుల్ గాంధీని చూసి కాంగ్రెస్ నేతలు ఆశ్చర్య పోవడమే కాకుండా, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మారిపోయిన రాహుల్.. ఇప్పుడు పార్టీలో తనను లీడర్‌గా అంగీకరించని వారికి సరైన సమాధానం చెబుతారని భావిస్తున్నారు.

అజ్ఞాతం వీడి స్వదేశానికి తిరికి వచ్చినప్పటి నుండి ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. రాజకీయంగా ఎదిగేందుకు తన ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాహుల్ చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆనందం కలిగిస్తున్నాయనే చెప్పవచ్చు. బుధవారం లోకసభలో ఇంటర్నెట్ తటస్థ వైఖరి గురించి వాదిస్తుంటే సోనియా ఆయన వైపు గర్వంగా చూశారంటున్నారు.
రాహుల్‌లో రాజకీయంగా ఆత్మవిశ్వాసం పెరగటం పట్ల సోనియా, కాంగ్రెస్ పూర్తి సంతృప్తితో ఉన్నారు. బుధవారం ఇంటర్నెట్ తటస్థ వైఖరి అంశంపై లోకసభలో మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసేందుకు ప్రయత్నించారు. బుధవారం సాయంత్రం లేడీ హార్డింగే ఆసుపత్రికి వెళ్లి ఏఏపీ ర్యాలీ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. గతంలో రాహుల్ ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవు.
లోకసభలో ఎప్పుడు ఆఖరు వరుసలో కూర్చునే రాహుల్ గాంధీ, రెండో విడత సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి రెండో వరుసలో, సోనియా వెనుక వైపున కూర్చుంటున్నారు. ప్రతి సభ్యుడు మాట్లాడేదాన్ని తీక్షణంగా పరిశీలిస్తున్నారు. రాహుల్ లీడర్ షిప్ పైన కాంగ్రెస్ పార్టీలోనే భిన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మార్పుతో రాహుల్ లీడర్‌గా మారేందుకు ఏ మేరకు దోహదపడుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications