హత్రాస్‌పై సుప్రీంలో పిల్... నిందితులకు,పోలీసులకు మధ్య కనెక్షన్?; కోర్టులో బోరున విలపించిన తల్లి...
హత్రాస్ దళిత యువతి గ్యాంగ్ రేప్ ఘటనపై సుప్రీం కోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సామాజిక కార్యకర్త చేతన్ జనార్దన్ కాంబ్లే ఈ పిల్ దాఖలు చేశారు.బాధితురాలి అంతిమ సంస్కారాలను అమానవీయంగా నిర్వహించిన అధికార యంత్రాంగంపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పిల్ ద్వారా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీస్ అధికారులు,ఆస్పత్రి సిబ్బంది,వైద్య అధికారులు,ప్రభుత్వ అధికారులపై డైరెక్ట్ కేసు నమోదు చేయాలని కోరారు. బాధితురాలి మృతదేహానికి హడావుడిగా దహన సంస్కారాలు నిర్వహించడం ద్వారా ఆధారాలను మాయం చేశారని... నిందితులను రక్షించే ప్రయత్నం చేశారని పిల్‌లో వీరిపై ఆరోపణలు చేశారు.

'నిందితులకు,పోలీసులకు మధ్య కనెక్షన్..'
'హత్రాస్ ఘటన అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉండి చట్టాన్ని అనుసరించాల్సిన అధికారులు ఒక దిగువ కులానికి చెందిన మహిళపై జరిగిన నేరాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేశారు. అసలు కేసు దర్యాప్తు కూడా మొదలు కాకముందే కొంతమంది ఉన్నతాధికారులు... అసలు బాధితురాలిపై అత్యాచారం జరగలేదని స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. దీన్నిబట్టి నిందితులకు,పోలీసులకు మధ్య ఉన్న సంబంధం అర్థమవుతోంది. కనీసం కుటుంబ సభ్యులను కూడా అంత్యక్రియలకు అనుమతించకుండా వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు.చట్టం,న్యాయం పట్ల ప్రజలకు విశ్వాసం సడలకుండా ఉండాలంటే ఇలాంటి అధికారులకు కఠిన శిక్ష విధించాలి.' అని పిల్‌లో చేతన్ కాంబ్లే కోరారు.

కోర్టులో బోరున విలపించిన తల్లి...
అటు అలహాబాద్ హైకోర్టు ఇదే ఘటనపై సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. తమ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు కోర్టు ఎదుట హాజరైన బాధితురాలి కుటుంబ సభ్యులు... తమ అంగీకారం,ప్రమేయం లేకుండానే తమ బిడ్డకు అధికారులు అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు అనుమతించలేదన్నారు. అయితే అధికారులపై తమకు ఎంత మాత్రం కక్ష లేదని... కేవలం తమకు న్యాయం జరగాలని మాత్రమే కోరుతున్నామని అన్నారు.బాధితురాలి తల్లి ఆరోజు జరిగిన ఘటన గురించి చెప్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిగా కనీసం తన బిడ్డను ఆఖరి చూపు కూడా చూసుకునే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మెజిస్ట్రేట్ వాదనపై కోర్టు అసంతృప్తి
అంత్యక్రియల విషయంలో అధికార యంత్రాంగం తమపై ఆధిపత్యం చలాయించిందని.. తమతో సంబంధం లేకుండానే ఆ తంతు పూర్తి చేశారని బాధితురాలి సోదరుడు కోర్టుకు తెలిపారు. తమ కుటుంబ సభ్యులతో అధికారులు అనుచితంగా కూడా ప్రవర్తించారని బాధితురాలి బంధువు ఒకరు వెల్లడించారు. మరోవైపు జిల్లా మెజిస్ట్రేట్ మాత్రం తమపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. అంత్యక్రియలను పద్దతి ప్రకారం గౌరవప్రదంగానే నిర్వహించామని చెప్పారు. మృతదేహంపై కిరోసిన్ చల్లి దహనం చేశారన్న ఆరోపణలను ఖండించారు. బహుశా కొన్ని వీడియోల్లో కొన్ని క్యాన్స్ కనిపించడంతో అలా భావించి ఉంటారని... కానీ అందులో ఉన్నది గంగా జలం అని స్పష్టం చేశారు. అయితే ఈ వాదనతో కోర్టు సంతృప్తి చెందలేదు.

ఘటన ఇలా జరిగింది...
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో సెప్టెంబర్ 14న స్థానిక దళిత(వాల్మీకి) యువతిపై నలుగురు ఉన్నత కులాలకు చెందిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం జరపడమే కాకుండా ఆమె నాలుక కూడా కోసేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఆఖరికి మెరుగైన వైద్యం కూడా ఆలస్యంగా అందడంతో.. ఘటన జరిగిన రెండు వారాలకు బాధితురాలు కన్నుమూసింది. అదే రోజు రాత్రి అధికారులు హడావుడిగా కనీసం బాధితురాలి తల్లిదండ్రులను కూడా అనుమతించకుండా దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుగుతోంది.