నా కొడుకు చనిపోలేదు: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు సంబంధించి సందీప్ తండ్రి ఉన్నికృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు చనిపోలేదని.. ముంబై ఉగ్ర దాడుల్లో బాధితుడు కాదని.. అతను డ్యూటీ మాత్రమే చేశాడని అన్నారు. ఇలాంటి ఘటన ఎక్కడ జరిగినా సందీప్ ఉన్నికృష్ణన్ అలాగే చేసేవాడని తెలిపారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ముంబై దాడుల కేసులో కీలక నిందితుడు తహవూర్ రాణాను అమెరికా ఎట్టకేలకు భారత్‌కు అప్పగించినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. తహవూర్ రాణాను భారత అధికారులు ఏప్రిల్ 10 లేదా ఏప్రిల్ 11 న భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది. అమెరికా జైలులో ఉన్న రాణాను అక్కడి అధికారులు భారత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి ఉన్నికృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

"26/11 ముంబై ఉగ్రదాడుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బాధితుడు కాదు. అతడొక సెక్యూరిటీ అధికారి. చావు ముందు ఎదురుగా నిల్చొని పోరాటం చేశాడు. చనిపోతానని తెలుసు కానీ వెనక్కు రాలేదు. ముంబైలో కాకపోతే వేరే చోటైనా నా కుమారుడు ఇలాగే చేసేవాడు. మనం ఇలాంటి ఘటనలను మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి" అని అన్నారు.
ముంబై దాడుల కేసులో కీలక నిందితుడు తహవూర్ రాణాను భారత్ కు తీసుకురావడం కీలక పరిణామం అని అన్నారు. ఇది ప్రజల గెలుపు.. డిప్లోమాటిక్ గెలుపు కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
ఏం జరిగింది..?
"మీరు పైకి రావొద్దు.. వాళ్ల సంగతి నేను చూసుకుంటా" మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన టీమ్ సభ్యులతో చెప్పిన చివరి మాటలు. 2008 నవంబరు 26 సాయంత్రం నుంచి నవంబర్ 29 ఉదయం వరకు సాగిన ముంబై ఉగ్రదాడులు దేశప్రజల్ని భయబ్రాంతులకు గురి చేశాయి. 2008 నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా టెర్రరిస్టులు ముంబై నగరంలోకి సముద్ర మార్గం గుండా ప్రవేశించారు. ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, ఒబెరాయ్, ట్రైండెంట్, తాజ్ హోటల్, కామా ఆస్పత్రి.. తదితర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు.
ఈ మారణహోమంలో 166 మంది మరణించారు. 300 మంది గాయపడ్డారు. వారిని కట్టడి చేసే ప్రయంత్నంలో 15 మంది పోలీసు అధికారులతోపాటు ఇద్దరు NSG కమాండోలు వీరమరణం పొందారు. వీరిలో 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్ కు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఒకరు.












Click it and Unblock the Notifications