ఉక్రెయిన్ వైద్య విద్యార్దులకు కేంద్ర ఊరట - కోర్సు పూర్తి చేసేలా : నిబంధనల సడలింపు..!!
ఉక్రెయిన్ పైన రష్యా యద్దం కారణంగా అనేక మంది భారతీయ విద్యార్ధులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ కోర్సుకు ఖర్చు భారత్ లోని ప్రయివేటు కాలేజీలతో పోలిస్తే చాలా తక్కువ. దీంతో...భారీ సంఖ్యలో భారత విద్యార్ధులు ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతిఏటా వేల మంది మెడిసిన్ ఔత్సాహికులు భారత్ నుంచి ఉక్రెయిన్‌కు వెళ్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు రష్యా యుద్దం కారణంగా అక్కడ వైద్య కోర్సు మధ్యలో ఉన్న విద్యార్ధులు స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో..వారి చదవు కొనసాగింపు పైన ఆందోళన వ్యక్తం అవుతోంది.
Recommended Video

వారి భవిష్యత్ కు నష్టం లేకుండా..
ఈ సమయంలో దీనికి ప్రత్యామ్నాయంగా..వారికి నష్టం లేకుండా ఏం చేయాలనే అంశం పైన కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వేలమంది మెడిసిన్ విద్యార్ధులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రాణాలతో బయట పడినా.. వారి మెడిసిన్ చదవు పైన వారికి బెంగ పోవటం లేదు. విద్యార్దుల తల్లి తండ్రులు సైతం ఖర్చు పెట్టి ఉక్రెయిన్ పంపిస్తే..మధ్యలోనే వారి కోర్సు ఆగిపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో..కేంద్రం విద్యార్ధుల కు ఊరట కలిగించేందుకు వీలుగా ఎన్‌ఎంసీ నిబంధనలు సడలించడం లేదా భారత్, ఇతర దేశాల్లో వైద్య విద్యను పూర్తిచేసేందుకు ఉన్న అవకాశాలపైన కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

నిబంధనల సడలింపు పైనా
జాతీయ మెడికల్ కమిషన్ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్) - 2021 నిబంధనల ప్రకారం, విదేశాల్లో మెడిసిన్ చదివే విద్యార్థులు కోర్సు, శిక్షణ, ఇంటర్న్‌షిప్ కూడా అక్కడే పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రాథమికంగా వైద్యవిద్య ఎక్కడ అవుతుందో మిగతావీ అక్కడే పూర్తి చేయాలి. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం మెడిసిన్ మధ్యలో స్వదేశానికి వచ్చి ఇక్కడ కోర్సు పూర్తి చేసేందుకు ప్రస్తుత నిబంధనలు అనుకూలించవు.
కానీ, ఉక్రెయిన్ లో చదువుతున్న విద్యార్దుల విషయంలో మాత్రం ఈ నిబంధనల సడలింపుకు ఉన్న అవకాశాల పైన అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్ లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా వారు తమ చదువు అక్కడ కొనసాగించే పరిస్థితులు లేవు.

భారత్ లో లేదా విదేశాల్లో పూర్తి చేసేలా
దీంతో.. వారికి భారత్ లోనే ప్రయివేటు కాలేజీల్లో కోర్సు పూర్తి చేయటం ..లేదా విదేశాల్లోని కాలేజీలకు బదిలీ చేసుకొనే అవకాశం కల్పించటం పైన చర్చలు మొదలయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ, జాతీయ మెడికల్ కమిషన్ ఈ అంశం పైన అధ్యయనం చేస్తున్నాయి. త్వరలోనే నీతి అయోగ్ సైతం ఈ రెండు విభాగాలతో సమావేశమై.. ప్రత్యామ్నాయాల పైన చర్చించనుంది.
మానవతా దృక్పథంతో విద్యార్ధుల కోర్సును పూర్తి చేసేందుకు వీలుగా అవకాశం కల్పించే అంశాల పైన కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. దీని ద్వారా ఉక్రెయిన్ లో యుద్దం కారణంగా ఎంబీబీఎస్ మధ్యలోనే వీడిన విద్యార్దులకు ఊరట ఇచ్చేలా నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications