ప్రకృతి ప్రకోపానికి 72 మంది బలి.. విచారం వ్యక్తం చేసిన మోడీ, ముర్ము !!
డార్జిలింగ్, ఉత్తర సిక్కిం, నేపాల్, భూటాన్‌లలో కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ విపత్తులో డార్జిలింగ్‌లో 20 మంది, నేపాల్‌లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉండగా.. పలువురికి గాయాలు కాగా, మరికొందరు గల్లంతయ్యారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ విషాద ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
కాగా శనివారం రాత్రి నుంచి డార్జిలింగ్‌లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక ఇళ్లు ధ్వంసమవ్వగా.. పలు ప్రాంతాల్లో పర్యాటకులు చిక్కుకుపోవడంతో, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) తో పాటు సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి, అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి.

సిలిగుడి-మిరిక్ ప్రాంతాలను కలిపే బాలసోన్ నదిపై ఉన్న ఇనుప వంతెన కూలిపోయింది. కలింపొంగ్ జిల్లాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. తీస్తా, మాల్ పర్వత ప్రాంత నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు డార్జిలింగ్‌లోని పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. టాయ్ ట్రైన్ సేవలను కూడా నిలిపివేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధితులకు నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనలపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నేపాల్‌లోనూ వరద పరిస్థితి భీతావహంగా ఉంది. తూర్పు నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ఆదివారం నాటికి 52 మంది మరణించారు.
కోసీ ప్రావిన్స్‌లోని ఇలామ్ జిల్లాలో 37 మంది చనిపోయారు. కోసీ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల వానల కారణంగా కాఠ్మాండూ లోయలోని భాగమతి, బిష్ణుమతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారత ప్రధాని మోదీ ఈ ప్రకృతి విపత్తుపై ఆవేదన వ్యక్తం చేస్తూ, నేపాల్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని, అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని 'ఎక్స్' ద్వారా తెలియజేశారు.
ఇక భూటాన్‌లోనూ వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో వేల మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. వారికి సహాయం అందించడానికి భారత సైన్యం రంగంలోకి దిగింది. డార్జిలింగ్‌లో కొండచరియలు విరిగి రహదారులు కొట్టుకుపోగా, కూలిపోయిన వంతెన వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications