ఉత్తరాదిలో నాలుగోరోజూ వర్ష బీభత్సం-హిమాచల్, ఉత్తరాఖండ్ లో రెడ్ అలర్ట్-యుమున ఉగ్రరూపం
ఉత్తరాదిని వరుసగా నాలుగోరోజూ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షాలతో జలశయాలన్నీ నిండుకుండల్లా మారిపోయాయి. యమునా నది ఉగ్రరూపం చూపిస్తోంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత వరద రావడంతో యమునా నదిలో భారీగా నీరు ప్రవహిస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు వరద ముంగిట నిలిచాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో వరుసగా నాలుగో రోజు కురుస్తున్న వర్షాలకు అనేక మంది చనిపోయారు. పలు రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి విధ్వంసం చోటు చేసుకుంది. బ్రిడ్జిలు కొట్టుకుపోవడం, వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడడంతో బండరాళ్లు దొర్లడం, ఉధృతంగా ప్రవహించే నీళ్లలో వాహనాలు కొట్టుకుపోవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాల కారణంగా రోడ్లన్నీ మునిగిపోయి వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

హిమాచల్ ప్రదేశ్‌లో మరణాల సంఖ్య 31కి చేరుకోగా, పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో ఐదు వర్షాలకు సంబంధించిన మరణాలు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో ఒక్కొక్కరు మరణించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు కసోల్, మణికరణ్, ఖీర్ గంగా, పుల్గా ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కుల్ లోని సైన్జ్ ప్రాంతంలోనే దాదాపు 40 దుకాణాలు, 30 ఇళ్లు కొట్టుకుపోయాయని నివేదికలు అందాయి.
ఒక్క హిమాచల్ ప్రదేశ్ లోనే మౌలిక సదుపాయాలకు వాటిల్లిన నష్టం రూ.3,000 కోట్ల నుండి రూ.4,000 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో నాలుగు రోజులుగా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, కాలువలకు వరదలు పోటెత్తాయి. దీంతో మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. పలు రాష్ట్రాలలో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది.
హిమాచల్ ప్రదేశ్ తో పాటు మూడు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications