భారీ వర్షాలు: వరదనీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు, విద్యార్థులను కాపాడారిలా (వీడియో)
హైదరాబాద్: అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ ఇప్పటికే తెలిపింది. హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు వరదనీటిలో చిక్కుకుంది. గత కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మాచన్‌పల్లి-కోడూరు మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరదనీరు భారీగా చేరింది.

A school bus carrying 30 students got stuck at an underpass as the road wad filled with rain water in Mahabubnagar #Telangana. Later with the help of locals all the children where safely moved out of the bus pic.twitter.com/ztf1HPGWfA
— Aneri Shah (@tweet_aneri) July 8, 2022
మరోవైపు, గురువారం రాత్రి నుంచి హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం పడింది. జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పారుతున్నాయి. పలు చోట్ల చెరువులు నిండు కుండలుగా మారాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు వరద నీటితో జలకళను సంతరించుకున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని కుమురం భీం, వట్టివాగు జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. భారీగా వరద రావడంతో.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.
కుమురంభీం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా.. ప్రస్తుతం 241. 30 ఉంది. 3వేల 299 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుండడంతో.. ఐదు గేట్ల ఎత్తి వెయ్యి 92 క్యూసెక్కుల నీటిని కిందకి వదిలారు. వట్టివాగు జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 239.500 మీటర్లు కాగా.. ప్రస్తుతం 238 మీటర్లకు చేరింది.పెద్దపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి, సరస్వతి బ్యారేజీల్లో జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో.. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజీలో భారీగా నీరుండడంతో.. 35 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి 92, 720 క్యూసెక్కుల ప్రవాహం రాగా... 35 గేట్లు ద్వారా అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజీలో 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని పంపిస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్టు పరిసరాల్లోని గోదావరి ఒడ్డున ఉన్న రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications