జార్ఖండ్ లో బీజేపీ ఎందుకు ఓడింది? స్టూడెంట్ యూనియన్ పార్టీ వల్లే పుట్టిమునిగిందా?
దేశమంతటా ఉత్కంఠ రేపిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దారుణంగా దెబ్బతినింది. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ కేవలం 28 సీట్లతో సరిపెట్టుకుని, అధికారానికి దూరం కావాల్సివచ్చింది. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి అనూహ్యంగా పుంజుకుని.. ఏకంగా దాదాపు 50 సీట్లతో పవర్ లోకి వచ్చింది. 2014 నుంచి దేశమంతటా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన బీజేపీ గ్రాఫ్ గత ఏడాది కాలంగా పడిపోతూ వచ్చింది. ఆమధ్య రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఇటీవల మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన కాషాయదళానికి ఇప్పుడు జార్ఖండ్ లోనూ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ లో బీజేపీ దెబ్బ తినడానికి ముఖ్యమైన కారణాల్ని ఒకసారి పరిశీలిస్తే..

మెల్లగా పట్టు జారింది..
2003లో జార్ఖండ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి అక్కడ బీజేపీ హవా కొనసాగింది. 2014 మోడీ హవాతో ఇంకాస్త బలంగా పాతుకుపోయింది. 2014 లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్(ఏఎస్ జేయూ) పార్టీతో పొత్తు పెట్టుకుని మెజార్టీ సీట్లు సాధించింది. 90 శాతం గిరిజనులుండే జార్ఖండ్ లో సాహసోపేతంగా నాన్ ఆదివాసీ వ్యక్తి రఘుబర్ దాస్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఇక 2019 లోక్ సభ ఎన్నికల్లో జార్ఖండ్ లోని 14 ఎంపీ స్థానాలకుగానూ 50 శాతానికి పైగా ఓట్ల శాతంతో 11 చోట్ల బీజేపీ గెలిచింది. ఆ ఊపుతోనే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది.

స్టూడెంట్ యూనియన్ పార్టీని పక్కన పెట్టి తప్పుచేశారు
ఇవాళ వెలువడిన జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల్ని పరిశీలిస్తే.. సింగిల్ గా పోటీచేసిన బీజేపీ 33.5 శాతం ఓట్లను రాబట్టుకోగలిగింది. బీజేపీతో విడిపోయి ఒంటరిగా పోటీచేసిన స్టూడెంట్ యూనియన్ పార్టీ 8.2 శాతం ఓట్లతో మూడు సీట్లను గెల్చుకుంది. ఈ రెండు పార్టీల ఓట్ల శాతాన్ని కలిపితే.. 41.7 శాతం అవుతుంది. ఇది కాంగ్రెస్ కూటమికి దక్కిన ఓట్ల శాతం(38.54శాతం) కంటే తక్కువ. దీని అర్థం.. స్టూడెంట్ యూనియన్ పార్టీని పక్కన పెట్టడం వల్ల బీజేపీ నష్టపోయినట్లుగానే భావించాలని విశ్లేషకులు అంటున్నారు.

సీట్ల షేరింగ్ లో తేడాలు రావడం వల్లే..
ఎన్నికలకు ముందు బీజేపీ, స్టూడెంట్ యూనియన్ పార్టీల మధ్య పొత్తు చర్చలు జరిగినప్పటికీ సీట్ల షేరింగ్ లో తేడాలు రావడంతో చర్చలు సక్సెస్ కాలేదు. స్టూడెంట్ యూనియన్ పార్టీ నేత సుదేష్ మాహతో తన స్థాయిని మించి ఎక్కువ సీట్లు డిమాండ్ చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఫలితాల్లో స్టూడెంట్ యూనియన్ పార్టీ 8.2 శాతం ఓట్లను సాధించడం చూసి బీజేపీ నేతలు ముక్కునవేలేసుకునే పరిస్థితి. మహారాష్ట్రలో శివసేనతోనూ బీజేపీ ఇలాంటి గొడవే పెట్టుకుంది. ఒకప్పుడు మిత్రపార్టీలు అడిగినన్ని సీట్లిచ్చి గౌరవించిన బీజేపీ.. ఏడాదికాలంగా ఒంటరిపోరుకు మొగ్గుచూపుతూ మెల్లమెల్లగా నష్టపోవడాన్ని గమనించొచ్చు.

భూచట్టాల సవరణ కూడా దెబ్బకొట్టింది..
జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి మరో ముఖ్య కారణం.. భూచట్టాల సవరణకు ప్రయత్నించడం. గిరిజనులకు తమ భూములపై హక్కులు కల్పించే ‘చోటా నాగ్ పూర్ టెనెన్సీ యాక్ట్‘, ‘సంతాల్ పర్గణా టెనెన్సీ యాక్ట్' తదితర చట్టాలకు సవరణలు చేయాలని రఘుబర్ దాస్ సర్కారు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. భూచట్టాల సవరణ యత్నాలకు వ్యతిరేకంగా పోరాడిన హేమంత్ సోరెన్ చివరికి హీరోగా నిలిచారు.












Click it and Unblock the Notifications