ఉప ఎన్నికల్లో స్టార్ హీరో పోటీ ?, డీసీఎం సోదరుడు క్లారిటీ ఇదే, సిల్లీ ప్రశ్నతో ?
లోక్‌సభ ఎన్నికల అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాల ఎన్నికలపై చర్చ జరుగుతుండగా కేంద్ర మంత్రి, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి రాజీనామాతో ఖాళీ అయిన రామనగర జిల్లాలోని చెన్నపట్టణ ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. చెన్నపట్టణ అసెంబ్లీ నియోజక వర్గం ఇప్పుడు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమయంలో బెంగళూరు రూరల్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ డీకే సురేష్ చెన్నపట్టణ నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలను ఓడించేందుకు డీకే సోదరులు మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. అలాగే చెన్నపట్టణ నియోజకవర్గం నుంచి ఈసారి ఎవ్వరూ ఊహించని అభ్యర్థి పోటీ చేస్తారని డీకే సోదరులు సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

డీకే బ్రదర్స్ చెప్పిన మాట ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. డీకే శివకుమార్ గానీ, డీకే సురేష్ గానీ ఉత్సాహంతో పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. మా కుటుంబంలో ఎవరూ కూడా ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చే ప్రశ్నే లేదు అని ఇప్పటికే డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నేను చాలా కాలం క్రితమే స్పష్టం చేశాను అని, అయితే దీనిపై తరుచుగా వస్తున్న పుకార్లను ఎవరూ వినవద్దని అభ్యర్థిస్తున్నానని డీసీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ అన్నారు
చెన్నపట్టణ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని డీకే సోదరులు ప్లాన్ చేస్తున్నారు. చెన్నపట్టణ ప్రతిష్ఠాత్మకమైన నియోజకవర్గం అయ్యింది, శతాభ్దం తర్వాత తొలిసారిగా ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని డీకే శివకుమార్ వర్గం భారీ ప్లాన్ వేసింది. మాజీ ఎంపీ డీకే సురేశ్ మాట్లాడుతూ చెన్నపట్టణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవ్వరూ ఊహించని వ్యక్తిని పోటీలో దింపుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ సర్ ప్రైజ్ అభ్యర్థి ఎవరనేది రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. సినీ రంగం నుంచి ఓ స్టార్ నటుడు పోటీ చేయబోతున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలిసింది. చెన్నపట్టణ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఛాలెంజింగ్ స్టార్, హీరో దర్శన్‌ను బరిలోకి దించే యోచన ఉందా అని శనివారం డీకే సురేష్ ను మీడియా ప్రశ్నించింది. ఇలాంటి సిల్లీ ప్రశ్నలకు స్పందించాల్సిన అవసరం లేదని మాజీ ఎంపీ డీకే సురేష్ నిర్లక్షంగా సమాధానం ఇచ్చారు.
చెన్నపట్టణ ఉప ఎన్నికల్లో మీ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు డీకే సురేష్ సాధానం ఇచ్చారు. బెంగళూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు తనను తిరస్కరించారని, అందుకే ఇక నుంచి నేను ఎన్నికల్లో పోటీ చెయ్యనని, కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తగా పని చేస్తానని డీకే సురేష్ చెప్పారు. మొత్తం మీద కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి ఇంతకాలం ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నపట్టణను ఎన్డీఏ కూటమికి దూరం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పక్కాప్లాన్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications