విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెరాయిన్ కేసు: నిందితుడు సుధాకర్ ఎవరు, ఆయన వెనుక ఎవరున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సుధాకర్

అఫ్గానిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన భారీ హెరాయిన్ రాకెట్ గుట్టురట్టయ్యింది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ విలువ సుమారుగా రూ.15వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాచవరం సుధాకర్, ఆయన భార్య వైశాలి కీలక నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే వారిని దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి సేకరించిన సమాచారంతో ఇప్పుడు దిల్లీ నుంచి చెన్నై వరకూ వివిధ ప్రాంతాల్లో విచారణ సాగిస్తున్నారు.

ఆషీ ట్రేడింగ్ కంపెనీ అడ్రస్ గా ఇచ్చిన ఇల్లు ఇదే

జీఎస్టీ వివరాలతో ప్రధాన నిందితుడు..

డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో జరిపిన తనిఖీలలో ఈ హెరాయిన్ పట్టుబడింది. ఏకంగా రెండు కంటైనర్లలో తరలిస్తుండగా పట్టుకున్నారు. టాల్కమ్ పౌడర్ పేరుతో ఈ హెరాయిన్‌ను రవాణా చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ కేసులో ఆరా తీస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అప్గానిస్తాన్‌లోని కాందహార్‌కి చెందిన హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి దీనిని దిగుమతి చేసుకున్నారు. ఆషీ ట్రేడింగ్ కంపెనీ అనే సంస్థ పేరుతో ఇది భారతదేశంలోకి వచ్చినట్టు నిర్ధారించారు. దాంతో డీఆర్ఐ అధికారులు విజయవాడలో ఆషీ ట్రేడింగ్ కార్యాలయం గురించి ఆరా తీశారు.

విజయవాడ నగరంలోని సత్యన్నారాయణపురం గడియారం వారి వీధిలో ఉన్న ఆ కంపెనీ అడ్రస్‌లో ఎటువంటి కార్యక్రమాలు లేకపోవడంతో ఆశ్చర్యపోయారు. అక్కడున్న ఓ పాత భవనానికి చిన్న పేపర్‌పై ఆషీ ట్రేడింగ్ కంపెనీ అని రాసి, జీఎస్టీఎన్ మాత్రమే అతికించి ఉండటాన్ని గుర్తించారు.

జీఎస్టీ సర్టిఫికెట్ కోసం ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. అందులో మాచవరం సుధాకర్, గోవిందరాజు వైశాలి అనే భార్యభర్తలను అరెస్ట్ చేశారు.

ద్వారపూడిలోని నిందితుల ఇల్లు

పోలీసులు వచ్చే వరకూ తెలీదు..

విజయవాడ అడ్రస్‌తో జీఎస్టీ సర్టిఫికెట్‌తోపాటుగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ సర్టిఫికెట్ (ఐఈసీ) కూడా తీసుకున్నట్టు అధికారులు నిర్ధారించారు.

జీఎస్టీ సర్టిఫికెట్‌లో మాత్రం బియ్యం, పండ్లు సహా వివిధ ఉత్పత్తులను ట్రేడింగ్ చేస్తామని పేర్కొన్నారు. విజయవాడ నగర పాలకసంస్థ నుంచి మాత్రం ట్రేడింగ్‌కి సంబంధించిన అనుమతులు తీసుకోలేదు. అంతేగాకుండా డేంజరస్ అండ్ అఫెన్సివ్ ట్రేడ్ లైసెన్స్(డీఅండ్ఓ) కూడా తీసుకోవాల్సి ఉండగా అది కూడా లేదు. మొత్తం కార్యకలాపాలన్నీ చెన్నై కేంద్రంగా జరుపుతుండడంతో స్థానికంగా తీసుకోవాల్సిన అనుమతుల జోలికి పోలేదని అధికారులు భావిస్తున్నారు.

"నాలుగు రోజుల క్రితం హఠాత్తుగా పోలీసులు వచ్చారు. ఆ ఇంటిలో చాలాసేపు గాలింపు జరిపారు. సమీపంలో ఉన్న వారిని కూడా అడిగారు. మాలో చాలామందికి ఆ ఇంట్లో ఇటీవల ఎలాంటి కార్యకలాపాలు జరిగినట్టు ఆనవాళ్లు కూడా లేకపోవడంతో ఆశ్చర్యపోయాము. పెద్దామె తారక గారు మాత్రం అప్పుడప్పుడూ వస్తూ ఉండేవారు. ఇటీవల ఆ ఇంట్లోకి ఎవరూ రాకపోవడంతో ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు హెరాయిన్ రవాణాకి అడ్రస్ ఆ ఇల్లు అని మీడియాలో చూసి కొంత కలవరపడ్డాము" అంటున్నారు స్థానికుడు పి రవీంద్ర.

సుధాకర్ తల్లి, సోదరుడు

ఎవరీ సుధాకర్

ఈ కేసులో అరెస్ట్ అయిన సుధాకర్ అత్తగారి ఇంటిని అడ్రస్‌గా చూపించి జీఎస్టీ లైసెన్స్ పొందినట్టు నిర్ధారించారు. ఆయన భార్య వైశాలి తల్లి గోవిందరాజు తారక పేరుతో ఆ ఇల్లు ఉంది. అయితే గతంలో విశాఖ కేంద్రంగా పనిచేసిన సమయంలో పరిచయమైన వారితో కలిసి ఈ డ్రగ్స్ మాఫియాలో ఆయన భాగస్వామి అయినట్టు అనుమానిస్తున్నారు.

మాచరాజు సుధాకర్‌ది తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి. అక్కడే ఆయన సోదరుడితో కలిసి తల్లి నివాసం ఉంటున్నారు. స్థానికులకు అతను విశాఖలో ఉంటున్నారని మాత్రమే తెలుసు. గడిచిన ఆరేళ్లుగా ద్వారపూడికి ఆయన రాలేదని స్థానికుడు జి గోపి బీబీసీతో అన్నారు. విశాఖలో ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్టు ప్రచారంలో ఉందని ఆయన అన్నారు. సుధాకర్ సోదరుడు ఓ ఆటో నడుపుకుని జీవనం సాగిస్తుండగా, అతని తల్లి వృధ్యాప్య పెన్షన్ తీసుకుంటున్నారు.

ద్వారపూడి

విశాఖ కేంద్రంగా ఓ సిమెంట్ కంపెనీలో సుధాకర్ లాజిస్టిక్స్ మేనేజర్‌గా పనిచేశారు. కస్టమ్స్, షిప్పింగ్‌కి సంబంధించిన వివరాలు అక్కడే తెలుసుకున్నట్టు దర్యాప్తు సంస్థల అంచనా. అదే సమంయలో పోర్టులో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన వ్యవహారాలన్నీ తెలుసుకోవడమే కాకుండా అక్రమ వ్యవహారాలు సాగించే ముఠాలతో స్నేహం మొదలయినట్టు భావిస్తున్నారు.

డ్రగ్స్ మాఫియాతో ఏర్పడిన పరిచయాలతో వారి సూచనతోనే సొంతంగా ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో లైసెన్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సుధాకర్ సంపాదించిన జీఎస్టీ, ఐఈఎస్ సర్టిఫికెట్లను డ్రగ్స్ మాఫియాకి అందించడంతో వారు పెద్ద మొత్తంలో ఒకేసారి డ్రగ్స్‌ని తరలించే స్థాయికి చేరినట్టు ఆధారాలు సేకరించారు.

ముంద్ర పోర్టు, గుజరాత్

టెర్రరిస్టు సంస్థల పాత్రపైనా దర్యాప్తు

అఫ్గానిస్తాన్ నుంచి ముంద్రా రేవుకి తరలించిన హెరాయిన్ కంటైనర్లను దేశంలోని వివిధ ఓడరేవులకు చేర్చి, అక్కడి నుంచి దిల్లీకి చేర్చే లక్ష్యంతో ప్రయత్నాలు చేశారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే అహ్మదాబాద్, దిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ ముఠా కార్యకలాపాలపై నిర్వహించిన తనిఖీలలో కొన్ని ఆధారాలు కూడా సంపాదించారు.

టెర్రరిస్టు సంస్థలకు కూడా ఈ మాఫియా నుంచి ముడుపులు ఇస్తున్నట్టు ఓ ప్రచారం సాగుతోంది. దానికి సంబంధించి కూడా ఆధారాలు సేకరించే ప్రయత్నంలో దర్యాప్తు, నిఘా వర్గాలు సాగుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ రవాణాలో వివిధ వర్గాలకు కూడా భారీగా లంచాలు కూడా చెల్లించి ఉంటారనే అభిప్రాయంతో లోతుగా విచారణ సాగిస్తున్నారు.

అరెస్ట్ చేసిన సుధాకర్, అతని భార్య నుంచి కూడా కొన్ని వివరాలు సేకరించారు.

ఈ కేసుకు సంబంధించి చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, దిల్లీ - నాలుగు డిఆర్ఐ బృందాలు విచారణ చేస్తున్నాయి.

కేసుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం పోలీసుల్ని, డిఆర్ఐను బీబీసీ సంప్రదించింది. అయితే, వార్త రాసే సమయానికి వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

హెరాయిన్

సుధాకర్‌కి వైసీపీ మద్దతు అంటూ ఆరోపణలు

విజయవాడ కేంద్రంగా తీసుకున్న సర్టిఫికెట్లతో ఈ భారీ దందా సాగుతున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో హెరాయిన్ వ్యవహారం దుమారం రేపుతోంది. రాజకీయంగా విమర్శలకు కారణమవుతోంది. అధికార పార్టీ మద్దతుతోనే ఇంత పెద్ద డ్రగ్స్ మాఫియా సాగుతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

"రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం నేర ఆంధ్రప్రదేశ్‌గా మార్చింది. ఎక్కడ స్కాం జరిగినా దాని మూలాలు ఏపీలోనే వుంటున్నాయి. రూ. 15 వేల కోట్ల డ్రగ్స్ రవాణా మూలాలు ఏపీలో ఉండడం ఆందోళనకరం. దీనికి వైసీపీ సమాధానం చెప్పాలి. కేసులో కీలక నిందితుడు సుధాకర్‌కి వైసీపీ మద్దతు ఉంది. ఇప్పటికే వేల కోట్ల విలువైన ఎర్ర చందనం, తిరుమల వెంకటేశ్వరస్వామి వారికి భక్తులు ఇచ్చిన తల వెంట్రుకలు కూడా విదేశాలకు తరలిస్తున్నారు. వాటిని ఎగుమతి చేస్తూ పక్క రాష్ట్రాల్లో దొరికిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు స్పెషల్ ఫ్లైట్‌లో ఈ అక్రమ సొమ్ముని విదేశాలకు తరలిస్తున్నారు" అంటూ టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్రమైన విమర్శలు చేశారు.

హెరాయిన్

అర్థంలేని విమర్శలు అంటున్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ సర్టిఫికెట్ తీసుకుని అక్రమంగా మాదక ద్రవ్యాలు పట్టుబడిన కేసులో ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అర్థరహితమని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అలాంటి విమర్శలు చేసే ముందు ఆలోచించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అంటున్నారు.

"టీడీపీ నేతలకు అలవాటు. గతంలో కాల్ మనీ వంటి మాఫియాలో వారున్నారు. యువతను విదేశాలకు తరలించిన చరిత్ర ఉంది. ఇప్పుడు ఎవరో నిందితుడు డ్రగ్స్ కేసులో పట్టుబడితే దానిలో విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. ఈ కేసు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర దర్యాప్తు బృందాలు పూర్తి వివరాలు వెల్లడించకుండానే టీడీపీ నేతలు, అనుకూల ప్రచార సాధనాల్లో సాగుతున్న ప్రచారం చూస్తుంటే ఏపీని బద్నాంచేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి. నిరాధారంగా నోటికొచ్చింది మాట్లాడి జనాలను నమ్మించవచ్చనే ప్రయత్నాలు మానుకోవాలి" అంటూ ఆయన బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Heroin case: Who is behind the accused Sudhakar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X