లోక్ సభలో జీరోకు పడిపోయిన ఆ పార్టీ ఎంపీల సంఖ్య, మాజీ ప్రధానికి షాక్, అదేకథ!
బెంగళూరు/న్యూఢిల్లీ: ఎన్నికల అఫిడవిట్‌లో అవకతవకల కారణంగా కర్ణాటకలోని హాసన్ లోక్‌సభ ఎంపీ స్థానం నుంచి విజయం సాధించిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణపై కర్ణాటక హైకోర్టు అనర్హత వేటు వేసింది. ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ. రేవణ్ణ, జేడీఎస్ ఎమ్మెల్యే ఎ. మంజులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసేందుకు ప్రజ్వల్ తరపు లాయర్లు సిద్ధమవుతున్నారు.
జేడీఎస్ ఎమ్మెల్యే ఎ. మంజు అప్పట్లో బీజేపీ టిక్కెట్ మీద హాసన్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అదే మంజుతో పాటు న్యాయవాది దేవరాజ్ గౌడ ప్రజ్వల్‌పై హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజ్వల్ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తుల సమాచారాన్ని దాచిపెట్టారని, తప్పుడు సమాచాం ఇచ్చారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

ప్రజ్వల్ రేవణ్ణను ఎంపీ పదవికి అనర్హులుగా ప్రకటించాలని మంజు, న్యాయవాది దేవరాజ్ గౌడ కోర్టును ఆశ్రయించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హాసన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎ మంజు పోటీ చేసి ఓడిపోవడం, అప్పుడు ఆయన బీజేపీలోనే ఉండటంతో ప్రజ్వల్ రేవణ్ణకు ఇబ్బందులు ఎదురైనాయి. తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంజు ఇదే ఏడాది మే నెలలో జేడీఎస్‌లో చేరారు. అరకలగూడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన మంజు విజయం సాధించారు. ఎన్నికల అఫిడవిట్‌లో ప్రజ్వల్ తన ఆస్తులపై తప్పుడు సమాచారం ఇచ్చారని మంజు గతంలో ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలతో ప్రజ్వల్ రేవణ్ణ వచ్చే ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేరు.

రాష్ట్రంలో జేడీఎస్ ఎంపీగా గెలిచిన ఏకైక వ్యక్తిగా ప్రజ్వల్ రేవణ్ణ నిలిచారు. హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలి ప్రయత్నంలోనే భారీ మెజార్టీతో గెలుపొందారు.ఇప్పుడు ప్రజ్వల్ అనర్హత వేటుతో లోక్‌సభలో జేడీఎస్ ఎంపీల సంఖ్య జీరోకి పడిపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఏడు స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో ప్రజ్వల్ ఒక్కరే గెలిచాడు. గత లోక్ సభ ఎన్నికల్లో పొత్తు కారణంగా కాంగ్రెస్ పార్టీ ప్రజ్వల్ రేవణ్ణకు మద్దతు పలికింది.
ప్రస్తుతం ప్రజ్వల్ తండ్రి, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ హోళే నరసీపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజ్వల్ సోదరుడు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. ఆయన తల్లి భవానీ రేవణ్ణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ప్రజ్వల్ తాత, మాజీ ప్రధాని దేవెగౌడ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రజ్వల్ చిన్నాన, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి చన్నపట్టణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.












Click it and Unblock the Notifications