ఉసురు తీసిన భారీ వర్షాలు: 88 మంది మృతి
సిమ్లా: భారీ వర్షాలు.. ఉత్తరాది రాష్ట్రాలను వదలట్లేదు. అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు నదులు పోటెత్తుతున్నాయి.. ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్.. ఇలా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమౌతోన్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం ఆయా రాష్ట్రాల్లో నమోదవుతోంది.
హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ.. భారీ వర్షాలకు చివురుటాకులా వణికిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్, రావి, సట్లేజ్.. నదులు మహోగ్రరూపాన్ని దాల్చాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్నాయి. ఆయా నదులపై నిర్మించిన బాస్పా, వాంగ్టో, నథ్పా రిజర్వాయర్లల్లో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరుకోవడంతో గేట్లన్నింటినీ ఎత్తివేశారు అధికారులు. దీని ప్రభావం తీర ప్రాంతాలపై పడింది.

బియాస్, రావి, సట్లేజ్ నదుల తీరప్రాంతాలన్నీ మునిగిపోయాయి. పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగి పడటంతో అటు రోడ్లు కూడా ఎక్కడికక్కడ ధ్వంసం అయ్యాయి. కొండ ప్రాంతాల్లో ఉండే రోడ్లే కాకుండా.. జాతీయ రహదారులు సైతం భారీ ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఇక వంతెనల గురించి చెప్పుకోనక్కర్లేదు.
వరద పోటెత్తిన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు. ఇప్పటివరకు లక్షన్నర మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఈ మధ్యాహ్నం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుకు.. వరద ముంపునకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే ఇప్పటివరకు 88 మంది దుర్మరణం పాలయ్యారు. 16 మంది గల్లంతయ్యారు. 100 మంది పైగా గాయపడ్డారు. వరదల్లో కొట్టుకుపోవడం, కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించిన ప్రమాదాల్లో వారంతా మరణించినట్లు హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 492 మూగజీవాలు మరణించినట్లు వివరించింది.












Click it and Unblock the Notifications