వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌతమ్ అదానీ కంపెనీలపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్... 10 రోజుల్లో 8 లక్షల కోట్లు మాయం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అదానీ

ప్రస్తుతం అదానీ గ్రూప్ కేంద్రంగా పెద్ద రాజకీయ వివాదమే నడుస్తోంది.

అదానీ గ్రూప్ 'మోసాలకు పాల్పడింది’ అంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక భారత స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్‌ను అదానీ గ్రూప్ ఖండించింది. ఆ సంస్థ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయినా స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నష్టపోవడం ఆగలేదు.

గత 10 రోజుల్లో అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.8 లక్షల కోట్లు తగ్గిపోయింది.

మొన్నటి దాక ఫోర్బ్స్ ప్రపంచం సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఇప్పుడు(ఫిబ్రవరి 2న) 22వ స్థానానికి పడిపోయారు.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ జారీ చేసిన రూ. 20 వేల కోట్ల ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ)కు రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదు. అంటే చిన్న మదుపర్లు ఆ షేర్లను కొనేందుకు ముందుకు రాలేదు.

చివరకు సంస్థాగత మదుపర్ల సాయంతో రూ.20వేల కోట్ల విలువైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లను అదానీ గ్రూప్ అమ్ముకోగలిగింది.

ఈ వివాదం మీద గత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఎట్టకేలకు నోరు విప్పారు.

'మా కంపెనీ ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నాయి. మా బ్యాలెన్స్ షీట్ బాగానే ఉంది. ఆస్తులు బాగానే ఉన్నాయి. రుణాలను తీర్చడంలో మాకు తిరుగులేని రికార్డు ఉంది’ అని గౌతమ్ అదానీ అన్నారు.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించిన రూ.20,000 కోట్ల విలువైన షేర్ల అమ్మకాన్ని (ఎఫ్‌పీఓ) నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కొనుగోలు ముగిసిన తరువాత ఎఫ్‌పీఓను నిలిపివేయడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

'ఎఫ్‌పీఓ పూర్తిగా సబ్‌స్రైబ్ అయినప్పటికీ, దాన్ని నిలిపివేయాలన్న మా నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అనిశ్చితి దృష్ట్యా ఇప్పుడు ఎఫ్‌పీఓ మీద ముందుకు వెళ్లడం నైతికంగా సరైనది కాదని బోర్డు భావిస్తోంది.

పెట్టుబడిదారుల ప్రయోజనాలే నాకు అత్యంత ముఖ్యం. వారికి నష్టం కలగకుండా ఉండేందుకు మేం ఎఫ్‌పీఓను వెనక్కి తీసుకుంటున్నాం’ అంటూ తన వీడియో సందేశంలో గౌతమ్ అదానీ తెలిపారు.

అదానీ గ్రూప్ మీద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై కమిటీ వేయాలంటూ పార్లమెంటులోనూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి.

ఎలా మొదలైంది?

సుమారు 10 రోజుల కిందటి వరకు ప్రపంచ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ మూడో స్థానంలో ఉన్నారు.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.20 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించే ఎఫ్‌పీఓ జనవరి 25న మొదలు కావాల్సి ఉండగా దానికి ఒక రోజు ముందు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక 'సంచలన’ రిపోర్ట్‌ను విడుదల చేసింది.

'అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంట్స్‌లో మోసాలకు’ పాల్పడింది అంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో ఆరోపించింది. గౌతమ్ అదానీ సోదరుల మీద ఆరోపణలు చేసింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది అమెరికాకు చెందిన ఇన్వెస్టెమెంట్ సంస్థ. షార్ట్ సెల్లింగ్‌లో ఆ కంపెనీకి మంచి నైపుణ్యం ఉంది. అంటే ఒక కంపెనీ షేర్లు భవిష్యత్తులో పడిపోతాయని ముందుగానే ఊహించి ఆ షేర్లను ప్రస్తుత ధరల వద్ద స్టాక్ మార్కెట్‌లో అమ్ముతారు. ఆ తరువాత షేరు ధర పడిపోయినప్పుడు మళ్లీ కొంటారు.

ఆ రెండు ధరల మధ్య తేడానే లాభం అవుతుంది. దీనినే షార్ట్ సెల్లింగ్ అంటారు.

అయితే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన రిపోర్ట్‌ను అదానీ కొట్టిపారేసింది.

'అవి ఆధారాలు లేని ఆరోపణలు. అది భారతదేశం మీద, దేశంలోని సంస్థల స్వతంత్రత మీద పక్కా ప్లాన్‌తో చేసిన దాడి’ అని అదానీ గ్రూప్ ప్రకటించింది.

అయితే, ఇవేవీ మదుపర్లలో భయాందోళనలను తొలగించలేక పోయాయి. స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ షేర్లు నష్టపోవడం మొదలైంది.

ఎయిర్‌పోర్టుల నుంచి పోర్టుల వరకు అనేక రంగాల్లో అదానీ గ్రూప్ వ్యాపారం చేస్తోంది. ఆ గ్రూప్‌కు చెందిన ఏడు కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయి ఉన్నాయి. అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు వేల కోట్ల రూపాయలను లోనుగా అదానీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చాయి. ఎల్‌ఐసీ వంటి బీమా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ కదలికలు

సాగిన మాటల యుద్ధం

అదానీ గ్రూప్, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మధ్య మాటల యుద్ధం నడిచింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను ఖండించిన అదానీ, దాని మీద అమెరికా, భారత్‌లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

అయితే తాము రిపోర్డులో అడిగిన 88 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ 'బెదిరించడం’ సరికాదని, తాము కూడా విచారణకు సిద్ధమేనని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రకటించింది.

ఆ తరువాత, సుమారు 400 పేజీల సమాధానాన్ని అదానీ గ్రూప్ విడుదల చేసింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టును 'కాలిక్యులేటెడ్ అటాక్ ఆన్ ఇండియా’గా అదానీ గ్రూప్ అభివర్ణించింది. అయితే 'జాతీయత చాటున మోసాలను దాచలేరు’ అంటూ హిండెన్‌బర్గ్ విమర్శించింది.

'మేం అడిగిన 88 ప్రశ్నల్లో 62 ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వడంలో విఫలమయ్యారు’ అని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.

ఆదరణ లేని అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీఓ

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక విడుదలైన మరుసటి రోజు అంటే జనవరి 25న అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.20 వేల కోట్ల ఎఫ్‌పీఓకు పెద్దగా స్పందన రాలేదు.

రెండో రోజు నాటికి 3శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్లు దానికి దూరంగా ఉన్నారు. జనవరి 30న కార్పొరేట్ ఫండ్స్, విదేశీ సంస్థాగత మదుపర్లు షేర్లు కొనుగోలు చేశారు. యుఏఈ రాచకుటుంబానికి చెందిన అబుధాబి ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3,200 కోట్లు) పెట్టుబడి పెట్టింది.

పారిశ్రామికవేత్తలు సజ్జన్ జిందాల్, సునీల్ మిత్తల్ చివర్లో వ్యక్తిగతంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లలో పెట్టుబడులు పెట్టినట్లు బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించింది.

తరువాత ఏంటి?

అదానీ గ్రూప్ కంపెనీలకు ఎంతెంత లోన్లు ఇచ్చారో వివరాలు ఇవ్వాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కోరినట్లు రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ కథనాలు చెబుతున్నాయి.

'మా బ్యాలెన్స్ షీట్ చాలా బాగా ఉంది. ఆస్తులు భద్రంగా ఉండటంతోపాటు క్యాష్ ఫ్లో కూడా బాగానే ఉంది. అప్పులను తీర్చడంలో మాకు తిరుగులేని రికార్డు ఉంది’ అని గౌతమ్ అదానీ అన్నారు.

'అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ల అమ్మకాన్ని ఆపడం ఆ సంస్థకు ఇబ్బందులు కలిగించే పరిణామమే. సంపన్ను మదుపర్లు కంపెనీని ఇంకా నమ్ముతున్నారని చూపించేందుకు అదొక అవకాశం’ అని బ్రోకరేజీ సంస్థ ఎవాండాకు చెందిన ఎడ్వర్డ్ మోయా రాయిటర్స్‌తో అన్నారు.

అదానీ గ్రూప్ షేర్లను తనఖా పెట్టుకొని లోన్లు ఇవ్వడాన్ని అమెరికాకు చెందిన సిటీగ్రూప్ నిలిపివేసింది. అదానీ గ్రూప్ బాండ్లను అనుమతించడాన్ని నిలిపివేసింది క్రెడిట్ సూయిసీ.

ఇటీవల చోటు చేసుకున్న పరిణమాల ప్రభావం అదానీ గ్రూప్ షేర్ల మీద ఎంతమేరకు ఉంటుందో తాము గమనిస్తున్నామని రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌కు చెందిన అనుబంధ సంస్థ ఇక్రా వెల్లడించింది.

ప్రస్తుత పరిణామాల ప్రభావం 'కొంత కాలం’ మాత్రమే ఉంటుందని ఇన్‌ఫ్రావిజన్ ఫౌండేషన్ మేనిజింగ్ ట్రస్టీ వినాయక్ ఛటర్జీ అంటున్నారు.

'ఒక మౌలిక సదుపాయాల రంగ నిపుణుడిగా అదానీ గ్రూప్‌ను సుమారు 25 ఏళ్లుగా గమనిస్తున్నా. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, సిమెంట్, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి విభాగాలు చాలా బాగా పని చేస్తున్నాయి.

అవి స్థిరంగా మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. స్టాక్‌ మర్కెట్ ఒడుదొడుకుల ప్రభావం వాటి మీద పడదు’ అని బీబీసీ ప్రతినిధి అరుణోదయ్ ముఖర్జీతో మాట్లాడుతూ అన్నారు.

కానీ ఇంతవరకు ఈ విషయం మీద 'సెబీ లేదా ప్రభుత్వం స్పందింకచపోవడం చిత్రంగా ఉంది’ అని స్వతంత్రంగా రీసెర్చ్ చేసే హేమిద్రా హజారీ అంటున్నారు.

'మదుపర్ల భయాందోళనలు తగ్గించేందుకు వారు తప్పకుండా మాట్లాడి ఉండాల్సింది’ అని ఆయన బీబీసీతో అన్నారు.

ఇప్పుడు ఈ వివాదానికి రాజకీయ రంగు కూడా పులుముకుంది.

భారత ప్రధాని నరేంద్ర మోదీకి గౌతమ్ అదానీ చాలా సన్నిహితునిగా చెబుతుంటారు. తద్వారా ప్రభుత్వం నుంచి అదానీ ప్రయోజనాలు పొందారని చాలా కాలంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఆ ఆరోపణలను అదానీ ఖండించారు.

ఇప్పుడు భారత పార్లమెంటులోనూ అదానీ గ్రూప్ మీద హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

అదనపు రిపోర్టింగ్: అరుణోదయ్ ముఖర్జీ

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Hindenburg effect on Gautam Adani companies... 8 lakh crore lost in 10 days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X