
మసీదులో హనుమాన్ చాలీసా పఠనానికి పిలుపు-మధురలో ఉద్రిక్తతలు-భారీ భద్రత
శ్రీకృష్ణ జన్మస్ధానంగా పేర్కొంటున్న మధురలో షాహీ ఈద్ గా స్ధలం, పక్కనే మసీదు ఉండటంపై హిందూ సంస్ధలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు కాస్తా మరో టర్న్ తీసుకుంటున్నాయి. ఇవాళ మధురలోని మసీదులో హనుమాన్ చాలీసా పఠనానికి తరలిరావాలంటూ హిందువులకు అఖిల భారత హిందూ మహాసభ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు కారణమవుతోంది. దీంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
గతంలో అయోధ్యలో రామజన్మభూమిలో శిలాన్యాస్ కోసమంటూ విశ్వహిందూపరిషత్ తో పాటు పలు హిందూ సంస్ధలు ఇచ్చిన పిలుపు, అనంతర పరిణామాలు రేపిన ఉద్రిక్తతలు, ఆ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత వంటి పరిణామాలు యూపీ జనం మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కోర్టుల్లో ఉండగానే ఇక్కడి మసీదులో హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ అఖిల భారత హిందూమహాసభ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు కారణమవుతోంది. పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఎలాంటి కొత్త కార్యక్రమాలకు అనుమతి లేదంటున్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలవుతోంది. దీంతో ఎలాంటి కొత్త కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏకంగా 1500 మంది సిబ్బందితో ఈ ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధించారు. పోలీసులు తమను అడ్డుకుంటే ఎక్కడ అడ్డుకున్నారో అక్కడే హనుమాన్ చాలీసా పఠిస్తామని హిందూ మహాసభ నేతలు చెప్తున్నారు. ఈ పిలుపు తర్వాత ఇప్పటికే పలువురు హిందూ మహాసభ సభ్యుల్ని గృహనిర్బంధం చేశారు. గతేడాది కూడా హిందూ మహాసభ ఇలాంటి పిలుపు ఇచ్చినా పోలీసులు అడ్డుకున్నారు.