"ఫ్రెండ్ షిప్" కి నో చెప్పిందని యువతిని పూజారి ఏం చేశాడంటే..?
ఢిల్లీకి చెందిన ఓ యువ పూజారి చేసిన దారుణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో తన ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌ను తిరస్కరించినందుకు ఓ యువతిపై కక్ష పెంచుకున్న అతడు, కృత్రిమ మేధ (AI) టూల్స్‌ను దుర్వినియోగం చేసి ఆమె జీవితాన్ని నరకంగా మార్చేందుకు ప్రయత్నించాడు. ఏఐ సాయంతో అసభ్యకర మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో చివరకు సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కాడు.
అహ్మదాబాద్ సిటీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఈ కేసులో ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల సుమిత్ నేమ్‌చంద్ శర్మను అరెస్టు చేశారు. "మిషన్ సైబర్ రక్షిక: #SecureHerSpace" కార్యక్రమం కింద మహిళలపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులను అరికట్టే చర్యల్లో భాగంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు సోషల్ మీడియాలో మతపరమైన వీడియోలు, ప్రవచనాలు చేస్తూ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో గుజరాత్‌కు చెందిన ఓ యువతితో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. మొదట మతపరమైన చర్చలతో ప్రారంభమైన సంభాషణలు, తర్వాత వ్యక్తిగత సంబంధాల వైపు మళ్లాయి. అయితే యువతి అతడి స్నేహ ప్రయత్నాన్ని తిరస్కరించడంతో శర్మ కక్ష పెంచుకున్నాడు.
2025 డిసెంబర్ నుంచి 2026 ఏప్రిల్ వరకు అతడు నిరంతరం ఆన్లైన్ ద్వారా యువతిని వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని ఫొటోలను డౌన్లోడ్ చేసిన నిందితుడు, ఆమె తల్లి ఫొటోలను కూడా సేకరించాడు. అనంతరం గూగుల్‌లో "AI remove clothes" వంటి టూల్స్ కోసం వెతికి, వివిధ వెబ్సైట్ల సాయంతో 100కు పైగా అసభ్యకర మార్ఫింగ్ చిత్రాలు, వీడియోలు తయారు చేశాడని పోలీసులు తెలిపారు.
ఇంతటితో ఆగకుండా, బాధితురాలి పేరు, ఫొటోలను ఉపయోగించి మూడు నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, ఒక యూట్యూబ్ ఛానల్ సృష్టించాడు. ఆ ఖాతాల్లో మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ యువతి ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లలో 8 నుంచి 10 వరకు ఫేక్ అకౌంట్లు నడిపినట్లు గుర్తించారు.
ఈ ఘటనతో బాధితురాలు తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా సామాజికంగా అవమానాలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలను దుర్వినియోగం చేసి మహిళలను వేధించే ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ ఎంహెచ్ భేటారియా నేతృత్వంలోని బృందం డిజిటల్ ట్రాకింగ్, ఐపీ అడ్రస్ విశ్లేషణ, సోషల్ మీడియా డేటా ఆధారంగా నిందితుడి ఆచూకీని గుర్తించింది. చివరకు ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు నిందితుడి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, డిజిటల్ స్టోరేజ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో భారీ మొత్తంలో మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు, ఫేక్ అకౌంట్ వివరాలు లభించినట్లు సమాచారం. ప్రస్తుతం ఐటీ చట్టం, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే నేరాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన మరోసారి ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం ఎంత ప్రమాదకరమో చూపించింది. సైబర్ నేరగాళ్లు సాధారణంగా అందుబాటులో ఉన్న టూల్స్‌ను ఉపయోగించి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వేధింపులు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications