వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మదర్ థెరిస్సా ఛారిటీ సంస్థలకు కేంద్రం షాక్..నిలిచిపోయిన సేవాకార్యక్రమాలు-భగ్గుమన్న మమతా

|
Google Oneindia TeluguNews

మదర్ థెరిస్సా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ (MoC) కేంద్ర హోంమంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. ఆ చారిటీ సంస్థకు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసేందుకు నిరాకరించింది. ఇందులో కొన్ని లోపాలను గుర్తించినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. దీంతో గత కొన్నేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న మదర్ థెరిస్సా సంస్థ మిషనరీస్ ఆఫ్ చారిటీకి బ్రేక్ పడినట్లయ్యింది. దీనిపై రాజకీయంగా కూడా పెద్ద దుమారమే రేగుతోంది.

సాధారణంగా ఏ ఎన్జీఓ లేదా చారిటీ సంస్థకు విదేశాల నుంచి విరాళాలు రావాలంటే ఆ సంస్థ తప్పనిసరిగా ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం కింద నమోదై ఉండాలి. ఈ క్రమంలోనే మిషనరీస్ ఆఫ్ చారిటీ కూడా రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. అయితే ఈ సారి మాత్రం కేంద్రహోంశాఖ ఈ సంస్థపై కాస్త కఠినంగానే వ్యవహరించినట్లు కనిపిస్తోంది. తాము దరఖాస్తు చేసుకున్న FCRA అప్లికేషన్‌కు ఆమోదం తెలపలేదని మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ పేర్కొంది. అదే సమయంలో ఆ సంస్థతో అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్ల నుంచి లావాదేవీలు జరపరాదని కూడా కేంద్రహోంశాఖ చెప్పినట్లు మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ వెల్లడించింది.

డిసెంబర్ 13వ తేదీన 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసింది MoC. విదేశాల్లో నివసిస్తున్న 347 మంది వ్యక్తుల నుంచి, 59 ఇతర సంస్థల నుంచి రూ.75 కోట్లు విరాళం కింద అందుకున్నట్లు డిక్లేర్ చేసింది. ఇక FCRA ఖాతాలో రూ.27.3 కోట్లు మిగులు ఉండగా... అది ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అయ్యిందని పేర్కొంది. దీంతో మొత్తం బ్యాలెన్స్ రూ.103.76 కోట్లుగా ఉందని ప్రకటించింది. ఇక కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థకు దేశవ్యాప్తంగా 250 బ్యాంకు ఖాతాలున్నాయి. ఇందులోకి వచ్చే విదేశీ విరాళాలు పలు సేవా కార్యక్రమాల కోసం వినియోగించడం జరుగుతోంది. ప్రాథమిక ఆరోగ్యం, విద్య, కుష్టు రోగులకు చికిత్స అందించేందుకు భారీ మొత్తంలో అమెరికా, యూకే లాంటి అగ్రదేశాల నుంచి విరాళాలు మిషనరీస్ ఆఫ్ చారిటీకి వస్తుంటాయి. ఈ రెండు దేశాల నుంచి దాదాపుగా రూ.15 కోట్లకు పైగా విరాళం అందుతూ ఉంటుంది.

Home Ministry rejects FCRA renewal to Mother Theresas Missionaries of Charity, Here is why

ఇదిలా ఉంటే డిసెంబర్ 25వ తేదీన MoC దరఖాస్తును తిరస్కరించినట్లు కేంద్రహోంశాఖ ప్రకటించింది. అయితే ఎందుకు తిరస్కరణకు గురైందో తెలపాలంటూ ఎవరూ తమ వద్దకు రాలేదని ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని పేర్కొంది. అప్లికేషన్‌ను పునఃసమీక్షించాలని కూడా కోరలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 31 వరకు మాత్రమే లైసెన్సు ఉందని అయితే దాన్ని డిసెంబర్ 31వరకు పొడిగించినట్లు కేంద్రహోంశాఖ వివరించింది.

"FCRA రెన్యూవల్ అప్లికేషన్ తిరస్కరించబడింది. అది ఆమోదం పొందేవరకు ఎవరూ ఏ అకౌంట్ నుంచి కూడా డబ్బులు వినియోగించ కూడదు. ఈ సమస్యకు పరిష్కారం దొరికేవరకు విదేశీ విరాళాలు కలిగిఉన్న బ్యాంకు అకౌంట్లను ఆపరేట్ చేయకూడదు" అని తమ సంస్థలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ సుపీరియర్ జనరల్ సిస్టర్ ప్రేమ. అంతేకాదు మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన FCRA రిజిస్ట్రేషన్ రద్దు కావడం కానీ లేదా సస్పెండ్ కావడం కానీ జరగలేదని సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్‌ను కేంద్రహోంశాఖ రద్దు చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి భగ్గుమన్నారు. కేంద్రం కావాలనే ఇదంతా చేస్తోందని మండిపడ్డారు. ఈ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేయడం ద్వారా 22వేల మంది పేషెంట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. వారికి ఆహారం, సమయానికి మందులు అందడం లేదని చెప్పారు. చట్టాలు తప్పకుండా పాటించాల్సిందేనని అయితే మానవ విలువలు మరిచి కాదని మమత అన్నారు. బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయడం ద్వారా ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా పేదలకు పెద్ద బహుమానమే కేంద్రం ఇచ్చిందని మిషనరీస్ ఆఫ్ చారిటీతో పనిచేస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే రాజకీయంగా ఈ అంశం పెద్ద దుమారమే లేపింది. కమ్యూనిస్టులు కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ అంశం పెద్దదిగా అవుతుండటంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. వెంటనే తాము మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థకు చెందిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయడం లేదని ప్రకటించింది. కేంద్రం ఇచ్చిన ప్రకటనపై ఫైర్ అయ్యారు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్. చేసిందంతా చేసి నష్టనివారణ చర్యలకు దిగిన కేంద్రప్రభుత్వానిది నీతిమాలిన చర్యగా డెరిక్ ఓ బ్రెయిన్ ట్వీట్ చేశారు.

English summary
Missionaries of Charity was denied the FCRA registration renewal by MHA taking an ugly turn.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X