ఒక్కదెబ్బతో కోటీశ్వరులైన 100 మంది HDFC ఖాతాదారులు-ఏం జరిగిందంటే ?
అసలే మన దేశంలో పెరుగుతున్న ధరలు, తగ్గిపోతున్న ఆదాయాలతో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్న రోజులివి. అలాంటిది ఏదో ఒక అద్బుతం జరిగి మన ఖాతాల్లో కోట్లు పడాలని కొందరు కలలు కంటుంటారు. అలాంటి అద్భుతం నిజమైతే, ఖాతాల్లో అమాంతం కోట్లు వచ్చి పడుతుంటే ఏం చేయాలో తెలియక తికమక పడ్డారు ఓ ప్రైవేటు బ్యాంకు కస్టమర్లు. ఈ బ్యాంకు పేరు హెచ్.డి.ఎఫ్.సి అయితే అది ఉన్న నగరం చెన్నై.

ఖాతాల్లో కోట్ల రూపాయల జమ
తమిళనాడులోని చెన్నైలో ఉన్న టీనగర్ హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకుకు చెందిన కస్టమర్లకు నిన్న ఆదివారం పండుగ దినంగా మారింది. ఈ బ్యాంకులో ఖాతాలున్నవారి ఖాతాల్లో ఒక్కొక్కరిగి వేలతో మొదలుపెట్టి లక్షలు, కోట్లు నిన్న జమ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా తమ ఖాతాల్లో భారీ మొత్తాలు జమ కావడం చూసిన సదరు కస్టమర్లు నోరెళ్లబెట్టారు. ఇంత మొత్తం తమ ఖాతాల్లో ఎవరు వేశారో తెలియక కాసేపు తికమక పడ్డారు. అనంతరం దీనికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కరిగా తెలిశాయి.

100 కస్టమర్ల ఖాతాల్లో 13 కోట్ల చొప్పున జమ
చెన్నై టీ నగర్ బ్యాంకు బ్రాంచికి చెందిన దాదాపు 100 మంది కస్టమర్ల ఖాతాల్లో ఇలా వేల నుంచి మొదలుపెట్టి కోట్ల రూపాయల వరకూ జమ అయినట్లు ఆ తర్వాత తేలింది. మొత్తం 100 ఖాతాల్లో ఒక్కో దానిలో రూ.13 కోట్ల రూపాయల చొప్పిన జమ అయినట్లు బ్యాంకు అధికారులు తేల్చారు. ఆ తర్వాత దీన్ని రికవరీ చేసే పనిలో పడ్డారు. దీంతో అప్పటివరకూ కోట్లు తమ ఖాతాల్లో జమ అయ్యాయని సంబరబడ్డ ఖాతాదారులకు షాకులు మొదలయ్యాయి.

సాంకేతిక లోపంతోనే
బ్యాంకు సర్వర్లలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఇలా చెన్నై హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఖాతాదారుల ఖాతాల్లో కోట్లాది రూపాయలు తమ అయినట్లు విచారణలో అధికారులు తేల్చారు.బ్యాంకు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం మే 29 తెల్లవారుజామున మెయింటెనెన్స్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌ను ప్రవేశపెట్టడం వల్ల సమస్య తలెత్తింది. దీని వల్ల అనూహ్యంగా డబ్బు ఇలా వివిధ ఖాతాల్లో జమ అయినట్లు నిర్ధారించారు. ఇప్పటివరకూ ఇలా జమ చేసిన అదనపు డబ్బు విత్‌డ్రా చేశారా అనే అంశాన్ని బ్యాంకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications