మావోలకు కోలుకోలేని దెబ్బ: గడ్చిరౌలి ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోలు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలీలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోలు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీ సంఖ్యలో నక్సల్స్ మరణించారు. 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయని వెల్లడించారు. ఈ మేరకు వివరాలను గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధృవీకరించారు. ధనీరా తాలూకా గ్యారబట్టి అడవి ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. కాగా, మృతి చెందిన మావోయిస్టుల సంఖ్యే పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు శనివారం ఉదయం నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు.
కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మావోయిస్టు నేత మిలింద్ తెల్ తుంబ్డే కూడా ఈ ఎదురుకాల్పుల్లో మరణించినట్లు సమాచారం. ఎల్గార్ పరిషత్-భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో పుణె పోలీసులు.. తెల్ తుంబ్డేను వాంటెడ్ లిస్టులో చేర్చారు.












Click it and Unblock the Notifications