బ్లాక్ మార్కెట్‌లోకి బ్లాక్ ఫంగస్ డ్రగ్... ఒక్కో ఇంజెక్షన్ రూ.50వేలకు... హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
కరోనా చికిత్సలో ఉపయోగించే రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌కి తరలించి సొమ్ము చేసుకుంటున్న ముఠాల కన్ను ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లపై కూడా పడింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే అంఫోటెర్సిన్-బి ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ఓ ముఠాను తాజాగా హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో డాక్టర్లు సైతం ఉండటం గమనార్హం.
పోలీసుల కథనం ప్రకారం... ఇటీవల తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడటంతో ఆ వ్యాధి చికిత్సకు ఉపయోగించే అంఫోటెర్సిన్-బి ఇంజెక్షన్లకు డిమాండ్ ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు హైదరాబాద్‌లోని కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి దందా మొదలుపెట్టారు. లంగర్‌హౌస్‌కి చెందిన డా.బి.రాంచరణ్,మలక్‌పేటకు చెందిన డా.గాలి సాయినాథ్,గాజుల రామారంకు చెందిన బి.సురేశ్,బాలానాగర్‌కు చెంది కె.శ్రీకాంత్,కూకట్‌పల్లికి చెంది సాయివర్దన్ కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు.

నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న చిల్లగొల్ల రవితేజ చౌదరి ద్వారా ఈ ముఠా ఐదు అంఫోటెర్సిన్ బి ఇంజెక్షన్లను సేకరించింది. సాధారణంగా ఈ ఇంజెక్షన్ ధర కేవలం రూ.314 మాత్రమే. కానీ బ్లాక్ మార్కెట్‌లో దీన్ని రూ.50వేలకు విక్రయించేందుకు ఈ ముఠా ప్రయత్నించింది. దీనిపై నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కి సమాచారం అందడంతో లంగర్ హౌస్ ప్రాంతంలో ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు డాక్టర్లు కూడా ఉన్నారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఇటీవలి కాలంలో బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ వ్యాధి సోకి కొంతమంది మృతి చెందారు.దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం హైదరాబాద్ కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా మార్చింది. తాజాగా ఈ వ్యాధిని నోటిఫయబుల్ డిసీజ్‌గా ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైనా తప్పకుండా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అలాగే బ్లాక్ ఫంగస్ అనుమానిత కేసుల వివరాలు కూడా ఆరోగ్య శాఖకు అందించాలని తెలిపింది.












Click it and Unblock the Notifications