హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌: కోవిడ్ టీకాను నర్సు ఫోన్లో మాట్లాడుతూ రెండు సార్లు వేసిందని ఆరోపించిన యువతి - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నర్స్ రెండుసార్లు వ్యాక్సీన్ వేసింది

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న నర్సు తనకు వెంటవెంటనే రెండుసార్లు టీకా వేసిందని ఓ యువతి ఆందోళన వ్యక్తం చేసిన ఘటన హైదరాబాద్‌‌లో చోటుచేసుకుందని ఈనాడు పత్రిక తెలిపింది.

ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కుంట్లూరు రాజీవ్‌ గృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీప్రసన్న(21) వెల్లడించిన వివరాలివీ..

''గురువారం ఉదయం 8.30 గంటలకు టీకా తీసుకునేందుకు పెద్దఅంబర్‌పేటలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు వెళ్లా. 11 గంటల సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సు పద్మ నాకు టీకా వేశారు.

అదే సమయంలో ఆమెకు ఫోన్‌ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతూనే అక్కడే కూర్చోవాల్సిందిగా ఆమె సూచించింది. ఏమైనా చెబుతుందేమోననే ఉద్దేశంతో అక్కడే కూర్చున్నా. సెల్‌లో మాట్లాడుతూనే ఆ నర్సు మరో దఫా టీకా ఇచ్చేసింది’’ అని లక్ష్మీప్రసన్న పేర్కొంది.

ఆందోళనకు గురై అక్కడే టేబుల్‌పై పడుకున్న లక్ష్మీప్రసన్నకు సిబ్బంది కొబ్బరినీళ్లు తాగించి సెలైన్‌ ఎక్కించారు.

టీకా రియాక్షన్‌ కాకుండా మరో ఇంజక్షన్‌ ఇచ్చి అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

రెండురోజుల పాటు ప్రత్యేక గదిలో ఉంచి పరిశీలించారు. యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో శనివారం ఉదయం ఆమెను ఇంటికి పంపారు.

''యువతికి రెండు డోసులు ఇచ్చినట్లు నిర్ధారణ కాలేదు. సిరంజిలోకి మందు లోడ్‌ చేసిన సమయంలో నర్సుకు ఫోన్‌ వచ్చింది. అప్పటికి ఆమె టీకా వేయలేదు. ఫోన్‌ మాట్లాడాక ఒక్కసారే వ్యాక్సిన్‌ వేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని అదనపు డీఎంహెచ్‌వోను ఆదేశించాం.’’ అని రంగారెడ్డిజిల్లా డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి తెలిపారని ఈనాడు పేర్కొంది.

'థర్డ్ వేవ్ తప్పదు'.. ఎయిమ్స్‌ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అనివార్యమని, రాబోయే 6 నుంచి 8 వారాల్లో సంక్రమణ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించినట్లు సాక్షి పత్రిక పేర్కొంది.

కరోనా మూడో వేవ్‌ కొన్ని నెలల్లో రావచ్చని అనేకమంది నిపుణులు హెచ్చరించిన పరిస్థితుల్లో గులేరియా అప్రమత్తంచేయడం గమనార్హం.

అయితే ప్రజలు కోవిడ్‌ నిబంధనలను పాటించడం, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడకుండా ఉండటం లాంటి జాగ్రత్తలను ఏ మేరకు అవలంభిస్తారనే దానిపై థర్డ్‌ వేవ్‌ రాక ఆధారపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

"కరోనా కేసులు తగ్గడంతో దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైంది. దీంతో ప్రజలు బయటికి రావడం, కోవిడ్‌ నిబంధనలను పాటించకపోవడం, ఒకే దగ్గర గుమిగూడడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్‌ వేవ్స్‌ నుంచి ప్రజలు ఏమీ నేర్చుకున్నట్లు లేదు" అని ఆయన అన్నారు.

"ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్‌ గతంలోని వేరియంట్స్‌తో పోలిస్తే మరింత బలమైంది. దీని సంక్రమణ వేగం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. యూకేలో డెల్టా వేరియంట్‌ మ్యూటేషన్‌ చెందుతోంది. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కరోనా వేవ్స్‌ మధ్య గ్యాప్‌ తగ్గిపోతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం" అని గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు.

"ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అన్‌లాక్‌ ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో ఏ ప్రాంతంలోనైనా 5% మించి పాజిటివిటీ రేటు నమోదైతే మినీ లాక్‌డౌన్‌ విధించాలి. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి. హాట్‌స్పాట్‌లలో కరోనా టెస్ట్‌లు చేయడం, సంక్రమణ ట్రాకింగ్‌తో పాటు చికిత్సపై దృష్టి పెట్టాలి" అని గులేరియా అన్నారని సాక్షి చెప్పింది.

"కరోనా కొత్త వేవ్‌ ప్రభావం మొదలుకావడానికి సాధారణంగా మూడు నెలలు పడుతుంది. కానీ వివిధ అంశాల ప్రభావంతో తక్కువ సమయంలో దాని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు కోవిడ్‌ నిబంధనలను పాటించాలి. బయటి వేరియంట్‌ భారత్‌లో వ్యాప్తి చెంది పరివర్తన చెందింది. అందుకే కరోనా హాట్‌స్పాట్‌లపై నిఘా పెంచాలి. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోస్‌ల మధ్య అంతరాల పెరుగుదల తప్పేం కాదు. కరోనాను ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరించాలి" అని గులేరియా తెలిపినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.

థియేటర్లు తెరుచుకుంటాయా

తెలంగాణలోతెరుచుకోనున్న థియేటర్లు.. ఏపీ పరిస్థితి డౌటే

కోవిడ్‌, లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణలో మూతపడిన థియేటర్లు ఆదివారం నుంచీ తెరుచుకోనున్నాయని ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఒక వార్త రాసింది.

కోవిడ్‌ కేసులు తగ్గుతున్న క్రమంలో శనివారం జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తి వేయాలని తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో తెరచుకోవచ్చని ప్రభుత్వం నిర్మాతలకు, థియేటర్లు యాజమాన్యాలకు శుభవార్త చెప్పింది. త్వరలోనే వెండితెర కళకళలాడబోతుందని పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

లాక్‌డౌన్‌ వల్ల థియేటర్లు మూతపడడంతో ఎన్నో చిత్రాలు ఓటీటీ బాటపట్టాయి. ఇప్పుడు సినిమా హాళ్లు తెరచుకుంటున్నాయనే శుభవార్త యాజమాన్యాలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో ఆనందం నింపింది. ఇప్పటికే కాపీ రెడీ అయ్యి విడుదల తేదీ ప్రకటించిన చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి.

లాక్‌డౌన్‌ ఎత్తి వేయడంతో చిన్నా, పెద్ద చిత్రాలన్నీ విడుదలకు క్యూ కట్టనున్నాయి.

ఈ జాబితాలో 'లవ్‌ స్టోరీ’, 'టక్‌ జగదీష్‌’, 'విరాటపర్వం’, 'ఆచార్య’, 'నారప్ప’. 'ఖిలాడి’, 'పాగల్‌’, 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం విడుదల తేదీలను రీ షెడ్యూల్‌ చేయాల్సి ఉంటుంది. నిర్మాతల సానుకూలతను బట్టి ఏ సినిమా ముందు, ఏది వెనుక అనేది ప్లాన్‌ చేసుకోవలసి ఉంది.

ఒకవేళ సినిమాలన్నీ వరుస కట్టినా, ఆంధ్రప్రదేశ్‌‌లో విడుదల పరిస్థితి ఏంటన్నది క్లారిటీ లేదు.

ప్రస్తుతం అక్కడ కూడా లాక్‌డౌన్‌, కర్ఫ్యూ అమలులో ఉంది. అక్కడి థియేటర్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలీదు.

తెలంగాణాలో థియేటర్లు తెరచుకుని, ఏపీలో మూతపడి ఉంటే నిర్మాతలు సినిమాలు విడుదల చేయడానికి ముందుకు రారు. రెండు చోట్ల వ్యాపారం జరిగితే నిర్మాతకు ఆదాయం ఉంటుంది.

అయితే దీనిపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలంటూ ఈ కథనం సాగింది.

శ్రీవారి ఆలయాలు

దేశవ్యాప్తంగా 500 వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం

శ్రీవారి ట్రస్టు ద్వారా దేశవ్యాప్తంగా 500 వేంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించాలని నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఇందులో భాగంగానే వారణాసి, ముంబైలోనూ శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామన్నారు. కశ్మీర్‌లో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాన్ని వచ్చే 18 నెలల్లో పూర్తిచేస్తామని తెలిపారు.

శనివారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. టీటీడీ పరిధిలోని అన్ని దేవాలయాల్లో 'గుడికో గోమాత’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

స్వామివారికి గోవు ఆధారిత ఎరువులతో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ధాన్యంతో నైవేద్యం సమర్పించాలని నిర్ణయించామన్నారు. ఇందుకు రైతులతో సహజ పంటలపై చర్చిస్తామని తెలిపారు.

టీటీడీలోని ప్రతి కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని రెగ్యులరైజ్‌ చేసేందుకు నూతన విధానం తీసుకురాబోతున్నట్టు చెప్పారు. 90 రోజుల్లో దీని పై నివేదిక రూపొందిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Hyderabad: A young woman accused of giving the Covid vaccine to a nurse twice while talking on the phone- Press Review
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X