జగన్ దారేది: మోడీతో కాంగ్‌పై సంకేతాలా, డోర్స్ ఓపెన్?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడి పాలనకు కితాబిచ్చారు. మోడీని ఒక పరిపాలకునిగా అభినందిస్తానన్నారు. ఈ వ్యవస్థను మార్చి అన్ని పార్టీలను లౌకిక వేదిక పైకి తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో పొత్తు విషయమై కమ్యూనిస్ట్, జనతా దళ్(యు)ల దారిలో నడుస్తానని చెప్పారు.
జగన్ మోడీ పాలనను ప్రశంసించడం, కమ్యూనిస్టు, జెడి(యు) దారిలో నడుస్తానని చెప్పడంపై ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోను చర్చ సాగుతోంది. మోడీని పొగిడినప్పటికి ఆయన బిజెపితో కలిసే అవకాశాలు లేవంటున్నారు. ఆయన పాలనను ప్రశంసించిన జగన్ లౌకికవాదంపై ఓ సూచన కూడా చేశారు. తద్వారా జగన్ వచ్చే ఎన్నికల అనంతరం బిజెపికి ఎట్టి పరిస్థితుల్లోను మద్దతిచ్చే అవకాశం కనిపించడం లేదంటున్నారు.

తాను కమ్యూనిస్ట్, జెడి(యు) దారిలో వెళ్తానని చెప్పారు. లెఫ్ట్ పార్టీలు ఎప్పటికీ బిజెపితో కలిసే ప్రసక్తి లేదు! కమ్యూనిస్టులు ప్రస్తుతానికి కాంగ్రెసుకు, బిజెపికి సమదూరం పాటిస్తున్నప్పటికీ కాంగ్రెసుతో కలిసిన సందర్భాలు ఉన్నాయి. భవిష్యత్తులోను కలవవచ్చు. ఇక నిన్నటి వరకు ఎన్డీయోలో ఉన్న జెడి(యు) ఇప్పుడు కాంగ్రెసు పార్టీ వైపు అడుగులు వేస్తోంది. ఆ పార్టీలను ప్రస్తావించడం ద్వారా జగన్ అవసరమైతే వచ్చే ఎన్నికల తర్వాత యూపిఏ 3కి మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
మోడీ పాలనను పొగడటానికి మరో కారణం కూడా ఉండి ఉండవచ్చునని భావిస్తున్నారు. అతనిని కితాబివ్వడం ద్వారా తాను వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీకి మద్దతివ్వననే సంకేతాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అలాంటి ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. అయితే మోడీకి కితాబివ్వడం ద్వారా జగన్ భారతీయ జనతా పార్టీకి కూడా తలుపులు తెరిచి పెట్టి ఉంటారనే అంశాన్ని కూడా కొట్టిపారేయలేమని మరికొందరు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications