మూడు చక్రాల కుర్చీ సర్కార్.. ఎన్నాళ్లుంటుందో..అంతా ఆయనే చేశారు: ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సుస్థిర పరిపాలనను అందించలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ఓ మూడు చక్రాల కుర్చీ వంటిదని, ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేమని ఆయన ఎద్దేవా చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించడానికి మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేెకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజా తీర్పునకు భిన్నంగా..
మహారాష్ట్రలో అధికారాన్ని అందుకోవాలని మరాఠా ఓటర్లు భారతీయ జనతా పార్టీ, శివసేన కూటమిని ఆదేశించారని గుర్తు చేశారు. దీనికి భిన్నమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయని చెప్పారు. పరిస్థితులన్నీ ఎదురు తిరిగినప్పుడు వాటిని ఎదిరించడం కష్టతరమౌతుందని అన్నారు. ప్రజల తీర్పుకు వ్యతిరేక పరిస్థితులు ఏర్పడినందు వల్ల సగౌరవంగా తాను పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తోందని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.

సంఖ్యా బలం లేదు..
అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన సంఖ్యా బలం తమ వద్ద లేదని ఫడ్నవీస్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం తమ బలం 105 మంది ఎమ్మెల్యేలేనని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 145 మంది సభ్యుల బలం అవసరం అవుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.

అంతా అజిత్ పవారే చేశారు..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ ను విశ్వసించడం కూడా పరాభవానికి ఓ కారణంగా భావిస్తున్నామని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. తనకు 54 మంది శాసన సభ్యుల బలం ఉందని అజిత్ పవార్ నమ్మించారని, వారి సంతకాలతో కూడిన లేఖను కూడా తనకు అందజేశారని అన్నారు. అజిత్ పవార్ చెప్పినట్టుగా ఆయన వెంట 54 మంది ఎమ్మెల్యేలు లేరనే విషయం తనకు ఆ తరువాత తెలియ వచ్చిందని చెప్పారు. తమకు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందనే విషయాన్ని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి నిరూపించుకున్నాయని అన్నారు.

విలువలకు కట్టుబడి ఉన్నాం..
ఇలాంటి పరిస్థితుల్లో పదవిలో కొనసాగడం సరికాదని ఫడ్నవీస్ చెప్పారు. ఈ కారణం వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బలం లేనప్పుడు గౌరవంగా తప్పుకోవడమే మేలని అభిప్రాయ పడ్డారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించే పార్టీ తమదని ఫడ్నవీస్ చెప్పారు. రాజకీయాలు, అధికారం కోసం తాము ఎప్పుడు అర్రులు చాచలేదని అన్నారు. రాజ్యంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణలో కట్టుబడి ఉండే పార్టీ బీజేపీ అనే విషయం తన రాజీనామాతో మరోసారి నిరూపితమైందని చెప్పారు.












Click it and Unblock the Notifications