అనుమానాలు, అందుకే మాట్లాడలేదు: శశిథరూర్, సునంద అప్‌సెట్..
న్యూఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ మృతి, ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) విచారణ నేపథ్యంలో శశిథరూర్ శుక్రవారం నాడు స్పందించారు. తాను మౌనంగానే ఉన్నానని, పోలీసులు తమ దర్యాఫ్తును కొనసాగించవచ్చునని థరూర్ వ్యాఖ్యానించారు.
తన భార్య సునంద పుష్కర్ మృతి పైన విచారణ జరిగిన తీరు మీద తనకు పలు అనుమానాలు ఉన్నాయని థరూర్ చెప్పారు. అసలు ఏ ఆధారాలతో పోలీసులు ఈ రకమైన నిర్ధారణకు వచ్చారన్నారు. సునందది హత్యేనని, సహజ మరణం కాదని ఎయిమ్స్ నిపుణులు వెల్లడించిన పోస్టుమార్టం నివేదికలో వెలుగు వచ్చిన నాలుగు రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు.
ఈ కేసు దర్యాఫ్తు దాదాపు ఏడాదిగా సాగుతోందన్నారు. ఇన్నాళ్లుగా తన మీద చాలా రకాల ఒత్తిళ్లు పని చేసాయన్నారు. బయటకు వచ్చి వ్యాఖ్యానించాలని తనను చాలామంది రెచ్చగొట్టినా, పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నప్పుడు తాను వచ్చి ఏదో మాట్లాడితే అది పోలీసుల దర్యాఫ్తును దెబ్బతీస్తుందనే ఉద్దేశ్యంతో, వారి మీద గౌరవం వల్ల మాట్లాడకుండా ఊరుకున్నానని చెప్పారు.

కొన్ని టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగ్ కోసం ఈ వ్యవహారం మీద బహిరంగ చర్చలు పెట్టాయని ఆయన మీడియా మీద మండిపడ్డారు. సునంద మృతితో ఆమె కుటుంబం గానీ, భర్తగా తాను గానీ చాలా బాధపడ్డామని, తాము చాలా ఇబ్బందుల్లో ఉన్నామన్నారు. ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా చూస్తుండటంతో ఇప్పుడు ఈ విషయం గురించి బయటకు వచ్చి మాట్లాడక తప్పలేదన్నారు.
విచారణలో పోలీసుల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదనే తాను భావించానని, సునంద మృతి తర్వాత కొన్ని రోజులకే తాను స్వయంగా విచారణ వేగవంతం చేయాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాశానన్నారు. తాను పోలీసులకు ఎఫ్పుడు ఈ కేసులో సహకరిస్తూనే ఉన్నానని చెప్పారు. పోలీసులను వారి పని వారిని చేయనిద్దామన్నారు.
మీడియా కూడా సంయమనం పాటించాలన్నారు. మానవత్వం ఉండాలన్నారు. సునంద మృతి కేసులో తాను పోలీసులకూ పూర్తిగా సహకరిస్తానని, కేసు విచారణ సాధ్యమైనంత త్వరగా కొలిక్కి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా, సునంద, థరూర్‌లో తరుచూ గొడవ పడేవారని, భర్త తీరు పట్ల పుష్కర్ అప్‌సెట్‌గా ఉన్నట్లుగా పనిమనిషి విచారణలో వెల్లడించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications