CJI NV Ramana: దురదృష్టవశాత్తు నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు: 8వ తరగతిలోనే ఆంగ్లం నేర్చుకున్నా
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మితిమీరిన వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇంట్లో కూడా మాస్కులు వేసుకునే పరిస్థితి ఎదురైందటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలను తీసుకున్నారో వివరించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయిందని, దాన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ఆదిత్య దుబే అనే 17 సంవత్సరాల విద్యార్థి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆసక్తికరమైన సంభాషణ..
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తుషార్ మెహతాతో సాగిన వాదనలు, సంభాషణలు ఆద్యంతం ఆసక్తి కలిగించాయి. ఎన్వీ రమణ తన విద్యార్థిదశను గుర్తు చేసుకున్నారు.

ఇంగ్లీష్ సరిగ్గా రాదు..
ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ- తనకు ఇంగ్లీష్ సరిగ్గా రాదని అన్నారు. ఆంగ్లంపై తనకు పట్టు అంతంత మాత్రమేనని చెప్పారు. ఇంగ్లీష్‌లో తాను మంచి వక్తను కాదని పేర్కొన్నారు. తన భావాలకు అనుగుణంగా పదాలను జోడించలేనని వ్యాఖ్యానించారు. దురదృష్టవశావత్తూ తాను సాఫిస్టికేటెడ్ స్పీకర్‌ను కానని సీజేఐ చెప్పుకొచ్చారు. అదే తన బలహీనత (డ్రాబ్యాక్)గా పేర్కొన్నారు. తాను 8వ తరగతికి వచ్చేంత వరకు తెలుగులోనే చదువుకున్నానని స్పష్టం చేశారాయన. 8వ తరగతిలోనే ఇంగ్లీస్‌ను నేర్చుకోవడం మొదలు పెట్టానని అన్నారు.

పాఠశాల విద్య మొత్తం తెలుగులోనే..
తన పాఠశాల విద్యాభ్యాసం మొత్తం తెలుగు మీడియంలోనే సాగిందని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. న్యాయ విద్యను మాత్రమే తాను ఇంగ్లీష్‌లో చదివానని పేర్కొన్నారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ తాను కూడా న్యాయ విద్యను ఇంగ్లీష్‌లోనే చదివానని, అప్పటి వరకు తనకు పాఠశాల విద్యాభ్యాసం మొత్తం గుజరాతీలో సాగిందని చెప్పారు. అందుకే- తాను వాదించే సమయంలో కొన్నిపదాలు కఠినంగా అనిపిస్తాయని, అది వక్రీకరణకు దారి తీయొచ్చనే భయం తనలో ఉందని తుషార్ మెహతా అన్నారు.

తప్పంతా రైతులదేనా?
తుషార్ మెహతా తన వాదనలను వినిపించే సమయంలో- ఢిల్లీలో వాయు కాలుష్యం మితిమీరడానికి కారణం కేంద్రం గానీ, ఢిల్లీ ప్రభుత్వం గానీ కారణం కాదని అన్నారు. హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రైతులు పెద్ద ఎత్తున ఎండుగడ్డిని దగ్ధం చేస్తుండటమే దీనికి కారణమని చెప్పారు. తప్పంతా రైతులదేననే అనే భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీజేఐ ఎన్వీ రమణ దీన్ని తప్పు పట్టారు. వాయు కాలుష్యం పెరగడానికి రైతులే కారకులైతే.. ఢిల్లీ ప్రజల మాటేమిటీ? వారు కారకులు కాదా? అని ప్రశ్నించారు. ఆ సమయంలో తుషార్ మెహతా ఇబ్బంది పడ్డారు. తన అర్థం అది కాదని, ఇంగ్లీష్ తనకు సరిగ్గా రాదని అన్నారు. దానితో ఎన్వీ రమణ కూడా తన గురించి చెప్పుకోవాల్సి వచ్చింది.

లాక్‌డౌన్ పెట్టాలంటూ..
పొరుగునే ఉన్న హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున ఎండుగడ్డిని దగ్ధం చేస్తున్నారని, దాని ప్రభావం ఢిల్లీ వాతావరణంపై పడుతోందంటూ తుషార్ మెహతా స్పష్టం చేసినప్పుడు ఎన్వీ రమణ అడ్డుకున్నారు. కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కనీసం రెండు రోజుల పాటు లాక్‌డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా వాయు కాలుష్యంపై అన్ని పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తక్షణమే పరిష్కరించాల్సిన విషయమని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications