శ్రీ కృష్ణుడు చెప్పిన 10 'మైండ్ కంట్రోల్' సీక్రెట్స్ ఇవే!
మహాభారత రణరంగంలో శతాబ్దాల క్రితం పుట్టిన భగవద్గీత.. కేవలం ఒక పవిత్ర గ్రంథం మాత్రమే కాదు, అది మానవ జీవితానికి దిక్సూచి. నేటి ఆధునిక ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం, కెరీర్ ఒత్తిళ్లు, సంబంధాల మధ్య గందరగోళం, ఆత్మవిశ్వాసం లేకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్న యువతకు గీత ఒక అద్భుతమైన కౌన్సిలర్‌లా దారి చూపిస్తుంది. ముఖ్యంగా తమ 20 లేదా 30 ఏళ్ల వయస్సులో ఉన్నవారు నిత్య జీవితంలోని సవాళ్లను అర్థం చేసుకొని, వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు భగవద్గీత ఒక కొత్త కోణాన్ని, ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది.
విశ్వానికి ప్రభువైన శ్రీకృష్ణుడు, వీరుడైన అర్జునుడి మధ్య జరిగిన 18 అధ్యాయాల సంభాషణ రూపంలో ఉండే ఈ అంతర్దృష్టి గ్రంథం.. క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ.శ. మూడవ శతాబ్దం మధ్య కాలంలో రచించబడిందని చరిత్రకారులు భావిస్తున్నారు. శతాబ్దాలు దాటినా ఇందులోని జ్ఞాన వచనాలు నేటికీ అంతే తాజాగా, ఆచరణాత్మకంగా ఉన్నాయి. మనసును ప్రశాంతపరిచి, జీవితాన్ని చూసే విధానాన్నే మార్చేసే.. భగవద్గీతలోని 10 అద్భుతమైన జీవిత సత్యాలు ఇక్కడ చూద్దాం..

మనసును మార్చే.. జీవితాన్ని గెలిపించే గీతామృతం:
1.ఫలితాన్ని ఆశించకుండా పని చేయడం:
"మీరు కేవలం కర్మ (పని) చేయడానికి మాత్రమే అర్హులు, దాని ఫలితాలపై మీకు ఎటువంటి నియంత్రణ లేదు."
మీరు చేసే ప్రయత్నంపైనే మీ దృష్టి ఉండాలి కానీ, వచ్చే రిజల్ట్ గురించి ముందే ఆందోళన చెందుతూ కూర్చుంటే ప్రస్తుత పని దెబ్బతింటుంది.
2.అనివార్యమైన మార్పును అంగీకరించడం:
"జన్మించిన దానికి మరణం ఎంత ఖచ్చితమో, మరణించిన దానికి పునర్జన్మ అంతే ఖచ్చితం. కాబట్టి అనివార్యమైన దాని గురించి విచారించవద్దు." జీవితంలో కొన్ని మార్పులను మనం ఆపలేము. కాలంతో పాటు వచ్చే మార్పులను అంగీకరించడమే విజ్ఞత.
3.కర్మలోని లోతును గ్రహించడం:
"కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూసేవాడే మనుషులలో బుద్ధిమంతుడు." పని చేయడంలో ఉండే నిశ్శబ్దాన్ని, ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు మనసులో జరిగే ఆలోచనల కదలికను అర్థం చేసుకోవడమే నిజమైన తెలివితేటలు.
4.మీ లాగా మీరు బతకడం:
"ఇతరుల జీవితాన్ని పరిపూర్ణంగా అనుకరించడం కంటే, మీ సొంత విధిని అసంపూర్ణంగానైనా సరే జీవించడం మేలు."
ఎవరినో చూసి వారిలా మారాలని ప్రయత్నించే కంటే, మీ ఒరిజినాలిటీని కాపాడుకుంటూ మీ మార్గంలో మీరు వెళ్లడమే ఉత్తమం.
5.నిస్వార్థ సేవా భావం:
"నిస్వార్థ సేవ ద్వారా, మీరు ఎల్లప్పుడూ సఫలమవుతారు, మీ కోరికలను నెరవేర్చుకుంటారు."
ఎలాంటి స్వార్థం లేకుండా సమాజానికి లేదా ఇతరులకు చేసే సాయం మనకు అంతిమంగా సంతోషాన్ని, విజయాన్ని తెచ్చిపెడుతుంది.
6.ఆత్మ యొక్క శాశ్వతత్వం:
"ఆత్మ నాశనానికి అతీతం. శాశ్వతమైన ఆత్మను ఎవరూ అంతం చేయలేరు."
శరీరానికి మాత్రమే అంతం ఉంటుంది కానీ, మన లోపల ఉండే చేతనకు ఎప్పటికీ చావు లేదు. ఈ సత్యం తెలిస్తే చావు పట్ల భయం పోతుంది.
7.జ్ఞానమే పరమావధి:
"ఈ ప్రపంచంలో జ్ఞానం వలె పవిత్రమైనది మరొకటి లేదు. యోగంలో పరిపూర్ణత సాధించిన వాడు కొంత కాలానికి తనలోనే ఈ జ్ఞానాన్ని పొందుతాడు."
నిజమైన జ్ఞానాన్ని మించిన సంపద లేదు. మన సాధన ద్వారానే ఆ అంతర్గత జ్ఞానం మనకు లభిస్తుంది.
8.సముద్రమంత ప్రశాంతత:
"నదులు సముద్రంలోకి ప్రవహించినట్లుగా, నిరంతరం ప్రవహించే కోరికల ప్రవాహం ద్వారా కలవరపడని వ్యక్తి మాత్రమే శాంతిని పొందగలడు."
ఎన్ని నదులు వచ్చి చేరినా సముద్రం ఎలాగైతే హద్దులు దాటకుండా ప్రశాంతంగా ఉంటుందో.. మనసులోకి ఎన్ని కోరికలు వచ్చినా చలించకుండా ఉండేవాడే నిజమైన శాంతిని పొందుతాడు.
9.మనస్సే స్నేహితుడు.. మనస్సే శత్రువు:
"తన మనస్సు ద్వారా తనను తాను ఉన్నతంగా చేసుకోవాలి కానీ, కించపరచుకోకూడదు. మనస్సు మాత్రమే ఒకనికి స్నేహితుడు లేదా శత్రువు."
మన ఆలోచనలే మనల్ని రాజును చేస్తాయి.. అవే మనల్ని కిందకు పడేస్తాయి. మన మనసును మన అదుపులో ఉంచుకుంటే అది మనకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది.
10. స్థిరబుద్ధిని కలిగి ఉండటం (సమత్వ భావం):
"సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ..." అంటే "జీవితంలో సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా.. లాభం కలిగినా, నష్టం వచ్చినా.. విజయం లభించినా, అపజయం ఎదురైనా వాటన్నింటినీ సమానంగా స్వీకరించాలి."












Click it and Unblock the Notifications