దేశంలో అదాని యాక్ట్‌ను అమలు చేస్తే ఓ పనై పోలా-
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సూచికగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దేశంలో అదాని యాక్ట్ ను ప్రవేశపెట్టాలని ప్రధాని మోదీకి రాష్ట్రపతి సూచన
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవ్వాళ ఆరంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఈ సమావేశాలను ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా సమరానికి సన్నద్ధమౌతోన్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను ప్రధాన అస్త్రాలుగా మలచుకుంటోన్నాయి.

ద్రౌపది ముర్ము ప్రసంగంలో కీలకాంశాలు..
తన ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రగతి, ఉగ్రవాదం, జీ20 సదస్సు, వైద్యారోగ్యం, ఆయుర్వేదం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, ఆత్మనిర్భర్ భారత్, రక్షణ రంగాల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠిన వైఖరిని ప్రపంచ దేశాలు అనుసరిస్తోన్నాయని అన్నారు. ప్రపంచంలోనే అంతరిక్ష శక్తిగా ఎదిగే దిశగా వేస్తోన్నామని, ఇందులో భాగంగా ప్రైవేటు ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించామని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ ఫైర్..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ చీఫ్ కే కేశవరావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశానికి సరైన దిశ-దశ చూపించలేకపోయారని మండిపడ్డారు. దేశం ఎదుర్కొంటోన్న అనేక సమస్యలు, ఇబ్బందుల గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించలేదని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే- దేశంలో ఎలాంటి సమస్యలు లేవని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్నట్లుగా అర్థం చేసుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వ హయాంలో దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిందని కేశవరావు అన్నారు. దీన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలను కేంద్రం తీసుకుంటుందని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం పెరుగుదల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా అంశాలన్నింటినీ పక్కన పెట్టి- అంతా బాగుందనే అభిప్రాయాన్ని కలిగించేలా రాష్ట్రప్రతి ప్రసంగాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని ధ్వజమెత్తారు.

అదాని యాక్ట్..
వీటన్నింటినీ పక్కన పెట్టి దేశంలో అదాని యాక్ట్ పేరుతో ప్రత్యేకంగా ఓ చట్టాన్ని అమలు చేస్తే సరిపోతుందంటూ కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదాని యాక్ట్ ను అమలు చేయాలంటూ ప్రధాని మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనలు చేయాలని అన్నారు. దేశంలో ప్రస్తుతం క్రూనీ క్యాపిటలిజం నడుస్తోందంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications