బాలీవుడ్‌కు ఐటీ షాక్ : అనురాగ్ కశ్యప్,తాప్సీ నివాసాలపై దాడులు.. ఏకకాలంలో 20 ప్రాంతాల్లో
బాలీవుడ్ సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్,నటి తాప్సీ పన్ను,నిర్మాతలు మధు మంతెన,వికాస్ భల్ కార్యాలయాలు,ఇళ్లపై బుధవారం(మార్చి 3) ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రిలయన్స్ ఎంటర్టైన్‌మెంట్ సీఈవో శిభాషిష్ సర్కార్, ఎక్సీడ్ కంపెనీ సీఈవో అఫ్సర్ జైదీ,క్వాన్ కంపెనీ సీఈవో విజయ్ సుబ్రహ్మణ్యమ్ కార్యాలయాలపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఎక్సీడ్,క్వాన్... ఈ రెండూ కంపెనీలు బాలీవుడ్‌లో ప్రముఖ సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ సంస్థలుగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి ఐటీ అధికారులు ఈ ఆకస్మిక దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఆ కంపెనీపై ఐటీ ఫోకస్...
ఫాంటమ్ ఫిలింస్ ప్రొడక్షన్ కంపెనీతో సంబంధం ఉన్న హైప్రొఫైల్ వ్యక్తుల కార్యాలయాలన్నింటిపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తుండటం గమనార్హం. దర్శకుడు అనురాగ్ కశ్యప్,మరో దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ,నిర్మాతలు మధు మంతెన,వికాస్ భల్ కలిసి గతంలో ముంబైలో ఈ కంపెనీ ఏర్పాటు చేశారు. మార్చి,2015లో రిలయన్స్ ఎంటర్టైన్‌మెంట్ ఇందులో 50శాతం వాటాను కొనుగోలు చేసింది.

20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు...
ఫాంటమ్ ఫిలింస్ ప్రొడక్షన్ కంపెనీ కొన్ని సినిమాలు,వెబ్ సిరీస్‌లు తెరకెక్కించగా ఇందులో కొన్ని హిట్ అవ్వగా,మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇదే క్రమంలో 2018లో వికాస్ భల్‌పై గతంలో ఫాంటమ్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగి ఒకరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో అదే సంవత్సరం ఆ కంపెనీ మూతపడింది. ఇప్పుడా సంస్థతో సంబంధం ఉన్న సెలబ్రిటీల కార్యాలయాలపై ఐటీ దాడులు చేపట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ముంబైతో పాటు పుణేలోని మొత్తం 20 ప్రాంతాల్లోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

తాప్సీపై ఐటీ దాడులు హాట్ టాపిక్...
బాలీవుడ్‌లో పింక్,తప్పడ్ వంటి సినిమాలతో తాప్సీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సామాజిక అంశాల్లోనూ ఆమె తన గొంతు వినిపించడంలో ముందుంటారు. ఇటీవల రైతు ఉద్యమానికి కూడా పరోక్ష సంఘీభావం ప్రకటించారు. రైతు ఉద్యమానికి అంతర్జాతీయ సెలబ్రిటీల మద్దతును తప్పు పడుతూ పలువురు దేశీ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై ఆమె విరుచుకుపడ్డారు. 'ఒక్క ట్వీట్ మీ సమగ్రతను దెబ్బతీస్తే.. ఒక్క ట్వీట్ మీ నమ్మకాన్ని దెబ్బతీస్తే.. ఒక్క ప్రదర్శన మీ మత విశ్వాసాలను దెబ్బతీస్తే.. ఈ అంశాలను లేదా వ్యవస్థలను బలోపేతం చేసే బాధ్యత తీసుకోవాలి. అంతేగానీ.. ఇతరులు చేస్తున్న ప్రచారాన్ని మీ భుజాల మీద మోసుకుని మద్దతుగా నిలవడం సరికాదు.' అని ఘాటుగా ట్వీట్ చేశారు. ఇలాంటి తరుణంలో తాప్సీ నివాసం,కార్యాలయాలపై ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి.