టార్గెట్ చైనా- వైమానిక దళం అమ్ములపొదిలో సరికొత్త బ్రహ్మాస్త్రం..!!
న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ చైనా తరచూ సరిహద్దుల్లో భారత్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటు లఢక్ మొదలుకుని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వరకు సుమారు 3,000 కిలోమీటర్లకు పైగా బోర్డర్ లో తరచూ ఉద్రిక్తతలకు కారణమౌతోంది. భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నిస్తూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందా దేశం. అటు దక్షిణ దిశగా- తరచూ చైనాకు చెందిన గూఢచర్య నౌకలు భారత జలాల్లో ప్రవేశిస్తోన్నాయి.
IAF Test-fired #BrahMos ER from Su-30 MKI 🔥 pic.twitter.com/whCds3tIu5
— Tatya Vinchu (@officialTatya_1) December 29, 2022
ఈ పరిణామాల మధ్య భారత వైమానిక దళం తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నౌకలను పేల్చేయడానికి ఉపయోగించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ వర్షన్‌ను వైమానిక దళాధికారులు ఇవ్వాళ విజయవంతంగా ప్రయోగించారు. బ్రహ్మోస్ మిస్సైల్ లేటెస్ట్ వర్షన్ ఇది. బంగాళాఖాతంలో సుఖోయ్ ఎస్‌యూ- 30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను సంధించారు.

సుఖోయ్ యుద్ధ విమానం నుంచి దూసుకెళ్లిన క్షిపణి- నిర్దేశిత దూరంలో గల నౌకను పేల్చి పారేసింది. దీనికి సంబంధించిన వీడియోను వైమానిక దళాధికారులు విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భూత ఉపరితలం/సముద్రంలోని సుదూర లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యాన్ని వైమానిక దళం సాధించినట్టయిందంటూ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో విడుదల చేసింది.

ఐఏఎఫ్, ఇండియన్ నేవీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), బీఏపీఎల్, హెచ్‌ఏఎల్‌ల సంయుక్తంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేశాయి. సుఖోయ్ యుద్ధ విమానం శక్తి సామర్థ్యాలకు కూడా ఈ ప్రయోగం అద్దం పట్టిందని, దాని పనితీరుతో పాటు క్షిపణి రేంజ్‌ను ఖచ్చితంగా అంచనా వేయగలగడానికి ఉపయోగపడిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించడానికి ఇది వీలు కల్పిస్తుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications