Tejas: కుప్పకూలుతున్న తేజస్ లు- ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం..!
ఒకప్పుడు స్వదేశీ తయారీ తేలికపాటి యుద్ద విమానాలుగా చెప్పుకున్న తేజస్ (tejas)ఫైటర్ జెట్లు ఈ మధ్య అనూహ్యంగా కుప్పకూలుతున్నాయి. ఏమైందో ఏమో తెలియదు కానీ ఎయిర్ షోల్లోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం భారత్ కు మరీ ఇబ్బందికరంగా మారింది. ఇన్నాళ్లు వీటిని భారత అమ్ములపొదిలో కీలక ఆస్త్రాలుగా భావించిన పరిస్దితి నుంచి తిరిగి ఎగిరే శవపేటికలన్న చర్చ జరుగుతోంది. దీంతో ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజాగా వైమానిక విన్యాసాల్లో మరో తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలడంతో వీటిపై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభించింది. అలాగే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న తేజస్ యుద్ద విమానాల్లో విస్తృతమైన సాంకేతిక తనిఖీలు ప్రారంభమయ్యాయి.ఈ నెల ప్రారంభంలో వైమానిక స్ధావరంలో తేజస్ ఫైటర్ జెట్ సాధారణ శిక్షణా కార్యక్రమం తర్వాత ల్యాండ్ అవుతుండగా కుప్పకూలింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఇందులో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. బహుశా ఆన్‌బోర్డ్ వ్యవస్థలలో వైఫల్యం ఉండవచ్చునని ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి.

ఈ ప్రమాదం తర్వాత సమగ్ర సాంకేతిక దర్యాప్తును నిర్వహించడానికి భారత వైమానిక దళం దాదాపు 30 సింగిల్-సీట్ తేజస్ జెట్ విమానాలను నిలిపివేసిందని పీటీఐ వార్తా సంస్ధ తెలిపింది. తాజాగా కుప్పకూలిన విమానం ఎయిర్‌ఫ్రేమ్ తీవ్రంగా దెబ్బతినడంతో దాన్ని వైమానిక దళం నుంచి తప్పించబోతున్నారు. అయితే ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటకు వచ్చి తీవ్ర గాయాలు లేకుండా తప్పించుకోవడం విశేషం. ఇప్పటివరకూ ఐఏఎఫ్ లో చేరిన తర్వాత తేజస్ లు మూడోసారి ప్రమాదానికి గురయ్యాయి. మార్చి 2024లో జైసల్మేర్ సమీపంలో మొదటి ప్రమాదం, నవంబర్ 2025లో దుబాయ్ ఎయిర్‌షోలో రెండో ప్రమాదం జరిగాయి. ఇప్పుడు తాజాగా మూడో ప్రమాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications