నేనింకా బతికే ఉన్నా... కన్ఫర్మేషన్ లేకుండా ఈ వార్తలేంటి... సుమిత్రా మహాజన్ ఆగ్రహం...
లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ చనిపోయారంటూ గురువారం(ఏప్రిల్ 22) నుంచి కొన్ని మీడియా సంస్థల్లో తప్పుడు కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సైతం ఆ ఫేక్ న్యూస్‌ని నిజమేనని నమ్మి సుమిత్రా మహాజన్‌కు సంతాపం ప్రకటించారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ట్వీట్ డిలీట్ చేశారు. మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం పట్ల సుమిత్రా మహాజన్ స్పందించారు. తాను ఇంకా బతికే ఉన్నానని స్పష్టం చేశారు.

ముంబై నుంచి బంధువులు ఫోన్లు చేశారు : సుమిత్రా
'కనీస ధ్రువీకరణ లేకుండా వీళ్లిలా వార్తలు ప్రసారం చేస్తే నేనేం చేయాలి.ఇండోర్ జిల్లా అధికారులనైనా అడిగి తెలుసుకోవచ్చు కదా..! కేంద్ర ప్రభుత్వం,లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇవన్నీ గమనించాలి..' అని సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. తాను చనిపోయానంటూ మీడియాలో వార్తలు రావడంతో క్షణాల్లో అది దేశమంతా పాకిపోయిందన్నారు. ముంబైలోని తమ బంధువులు ఫోన్లు చేశారని ఆరా తీశారని చెప్పారు.
సుమిత్రా మహాజన్ కుమారుడు మందర్ కూడా దీనిపై స్పందించారు. ప్రస్తుతం తన తల్లి పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా ఉందన్నారు. ఫేక్ న్యూస్‌ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఆమెకు కోవిడ్ 19 నెగటివ్‌గా తేలిందన్నారు.
ఫేక్ న్యూస్ ట్రాప్‌లో పడ్డ శశి థరూర్...
అంతకుముందు,కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా ఈ ఫేక్ న్యూస్ ట్రాప్‌లో పడ్డారు. సుమిత్రా మహాజన్ నిజంగానే చనిపోయారని భావించి తన ట్విట్టర్‌లో సంతాపం కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే అసలు విషయం తెలిసి ట్వీట్ డిలీట్ చేశారు. ఆ తర్వాత మరో ట్వీట్‌లో 'విశ్వసనీయమైనదిగా భావించే ఓ సోర్స్ నుంచి నాకు ఆ సమాచారం వచ్చింది.ఏదేమైనా అది నిజం కాదని తెలిసి ఉపశమనం పొందాను.' అని పేర్కొన్నారు. ఏ ఉద్దేశంతో కొంతమంది ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తారో అర్థం కాదంటూ మరో ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమిత్రా మహాజన్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు.

వైద్య పరీక్షలు చేయించుకున్న సుమిత్రా...
సుమిత్రా మహాజన్ బుధవారం(ఏప్రిల్ 21) స్వల్ప జ్వరంతో ఇండోర్‌లోని బాంబే ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లోనూ కోవిడ్ నెగటివ్‌గా తేలింది. అయితే ఆమె ఆస్పత్రిలో చేరిందన్న విషయం తెలియగానే కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో ఆమెకేదో జరిగిందన్నట్లు వార్తలు ప్రసారం చేశాయి. ఇదే క్రమంలో మరికొన్ని మీడియా సంస్థలు ఏకంగా ఆమె చనిపోయారని వార్త కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే సుమిత్రా మహాజన్ స్వయంగా దీనిపై స్పందించి ఫేక్ న్యూస్ ప్రచారానికి చెక్ పెట్టారు.












Click it and Unblock the Notifications