రూ.4 వేల కోట్ల కుంభకోణంలో షాకింగ్ ట్విస్ట్: ఐఎఎస్ అధికారి ఆత్మహత్య: ఉరి వేసుకుని: అనుమానాలు
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఐఎంఎ పోంజి కుంభకోణంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో నిందితుడిగా విచారణను ఎదుర్కొంటోన్న సీనియర్ ఐఎఎస్ అధికారి బీఎం విజయ్ శంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరు జయనగర ప్రాంతంలోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఐఎంఏ స్కామ్‌లో భారీ ఎత్తున ముడుపులను స్వీకరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది.

సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో
ఐఎంఏ కుంభకోణంలో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు.భార్య, కుమార్తెతో జయనగర ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో గడిపారు. అనంతరం తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గదిలోకి వెళ్లి.. ఉరి వేసుకున్నారు. రాత్రి భోజనానికి ఆయనను పిలవడానికి వెళ్లగా.. ఎంతకీ తలుపు తెరవకపోవడంతో తిలక్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన ఇంటికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా.. ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు.

ఐఎంఏ కుంభకోణంలో కోటిన్నర లంచం
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. 2001లో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ అధికారి (కేఎఎస్)గా ఎంపిక అయ్యారు. 2014లో ఐఎఎస్‌గా ప్రమోట్ అయ్యారు. ఐఎంఏ కుంభకోణంలో కోటిన్నర రూపాయలను ఆయన లంచంగా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంపై విచారణ చేపట్టడానికి కర్ణాటక ప్రభుత్వం ఇదివరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సహా సీబీఐ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు.

దర్యాప్తు భయం వల్లేనా...
విజయ్ శంకర్ బెంగళూరు అర్బన్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఐఎంఎ స్కామ్‌లో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్ నుంచి కోటిన్నర రూపాయలను లంచంగా తీసుకుని క్లీన్‌చిట్ ఇచ్చారని సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ కేసులో విజయ్ శంకర్ తో పాటు మరో ఇద్దరిని విచారించడానికి కర్ణాటక ప్రభుత్వం కొద్దిరోజుల కిందటే సీబీఐకి అనుమతి ఇచ్చింది. విచారణ తప్పదని భావించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అనుమానిస్తున్నారు.
Recommended Video

మధ్యాహ్నం వరకు కార్యాలయంలో..
మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఆయన తన కార్యాలయంలో గడిపారు. సమీక్షా సమావేశాలను నిర్వహించారు. 12:30 గంటలకు తన కార్యాలయం నుంచి జయనగర ప్రాంతంలోని నివాసానికి బయలుదేరి వెళ్లారని సిబ్బంది వెల్లడించారు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారని, అనంతరం భార్య, కుమార్తెతో కొద్దిసేపు గడిపారని తెలుస్తోంది. ఆ సమయంలో ఆయన నిరాశగా ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొద్దిసేపటికే ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు.












Click it and Unblock the Notifications