ఐఏఎస్ రవి మృతిపై లోకసభలో బీజేపీ ఎంపీ, హోంమంత్రి స్థిరాస్థి పైనా దాడి!
న్యూఢిల్లీ: కర్నాటక రాష్ట్రంలోని ఐఏఎస్ రవి హత్య పైన మంగళవారం లోకసభలో ప్రస్తావన వచ్చింది. భారతీయ జనతా పార్టీ కర్నాటక శాఖ అధ్యక్షుడు, ధార్వాడ లోకసభ సభ్యుడు ప్రహ్లాద్ జోషీ మంగళవారం నాడు లోకసభలో డీకే రవి అనుమానాస్పద మృతిని ప్రస్తావించారు.
దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును మూసివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డీకే రవి పలు స్థిరాస్థి సంస్థల పైన దాడులు చేశారని, వాటిలో రాష్ట్ర హోంమంత్రి భాగస్వామ్యం ఉన్న స్థిరాస్థి సంస్థ, రిసార్డులు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
కాగా, డీకే రవి స్వస్థలం తుమకూరు జిల్లా దొడ్డ కొప్పలు గ్రామంలో ఆయన భౌతిక కాయానికి మంగళవారం అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రులు జయచంద్ర, డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత జగదీశ్ శెట్టార్, హెచ్‌డీ కుమారస్వామి తదితరులు హాజరయ్యారు.

మరోవైపు, ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతిపై కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన రవి మృతిపై మంగళవారం కర్నాటక అసెంబ్లీ అట్టుడికి పోయింది. ప్రతిపక్ష బిజెపి, జెడిఎస్ సభ్యులు సభలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
పోడియం వద్దకు దూసుకెళ్లి ప్రభుత్వ అలక్ష్యం వల్లే సమర్థుడైన అధికారిని కోల్పోయామని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు సభలోనే ధర్నా చేసి తమ నిరసన తెలిపారు. రవి అనుమానాస్పద మృతిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీబీఐ విచారణకు అంగీకరించకపోవడంతో ప్రతిపక్షం ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది.
ఐఎఎస్ అధికారిని ఆత్మహత్యేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని ముఖ్యమంత్రి చెప్పారు. మరోపక్క రవి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోలార్ జిల్లా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళననకు దిగారు. జనం స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పాఠశాలలు మూతపడ్డాయి. రవి అనుమానాస్పద మృతిపై సీఐడీ విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు.












Click it and Unblock the Notifications