అధిష్టానం మా మాట వినకపోతే, మేం విఫలమైనట్లే : కాంగ్రెస్ సంక్షోభంపై కపిల్ సిబల్
కాంగ్రెస్ పార్టీలో గతేడాది తెరపైకి వచ్చిన నాయకత్వ సంక్షోభం ఆ తర్వాత చల్లబడింది. అయితే తాజాగా యూపీ కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడంతో తిరిగి నాయకత్వ సంక్షోభంపై చర్చ మొదలైంది.. జితిన్ ప్రసాద అలా బీజేపీ గూటికి చేరారో లేదో అప్పుడే గతంలో నాయకత్వ సంక్షోభానికి కారణమైన నేతలు ఒక్కొక్కరిగా స్పందించడం మొదలుపెట్టారు.
కాంగ్రెస్‌లో తాజా సంక్షోభంపై స్పందించిన సీనియర్ నేత కపిల్ సిబల్ పార్టీ తమ వాదన వినడంలో విఫలమైతే తామంతా విఫలమైనట్లేనని వ్యాఖ్యానించారు. అయితే పార్టీ నాయకత్వం తమను పట్టించుకోనంత మాత్రాన పార్టీని వీడిపోబోనన్నారు. పార్టీ అధిష్టానం నేతల వాదన ఆలకించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భావజాలం కంటే వ్యక్తిగత లాభం కోసం చేసే రాజకీయాలకు మాత్రం తాను వ్యతిరేకమని జితిన్ ప్రసాదను ఉద్దేశించి కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.

పార్టీ నాయకత్వం చేసిన లేదా చేయని దానిపై తానేమీ వ్యాఖ్యానించబోనని కపిల్ సిబల్ తెలిపారు. జితిన్ ప్రసాద వంటి నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు భావజాలం మీద కంటే వ్యక్తిగత లాభాల ఆధారంగానే ఉంటున్నాయన్నారు. దీనికి ప్రధాన కారణం బీజేపీ గెలుస్తుందని వారంతా నమ్ముతుండటమే అన్నారు తాజాగా బెంగాల్లోనూ బీజేపీని నమ్మి చాలా మంది వెళ్లారని ఆ తర్వాత ఏం జరిగిందో చూశారని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, కర్నాటక, మహరాష్ట్రలోనూ గతంలో ఇలాంటివి జరిగాయన్నారు.












Click it and Unblock the Notifications