ఆత్మప్రబోధానుసారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తే...
ఆత్మప్రబోధానుసారం ప్రతి ఒక్కరూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేస్తే యశ్వంత్‌సిన్హా విజయం సాధిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో వి.వి.గిరి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడినప్పుడు అందరూ ఇలాగే ఓటువేయడంతో ఆయన గెలుపు సులభమైందన్నారు. ఆ విషయాన్ని కేసీఆర్ గుర్తుచేస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తమ మనస్సాక్షి ప్రకారం ఓటువేయాలని కోరారు.
విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడిన యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ పిలిపించి కేసీఆర్ మర్యాదలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మరీ ఆహ్వానం పలికారు. ప్రధానమంత్రి వస్తే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పంపించారు. తలసానిని పంపించడం మూడోసారి కావడం గమనార్హం. ఎన్డీయే అభ్యర్థిగా నిలబడిన ద్రౌపది ముర్ము గెలుపు సునాయాసమంటూ వార్తలు వస్తున్న తరుణంలో యశ్వంత్ సిన్హాయే విజయం సాధిస్తారంటూ కేసీఆర్ చెబుతున్నారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా విజయం సాధించాలంటే ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారై ఉండాలని, ఆ మహోన్నతమైన వ్యక్తిత్వం యశ్వంత్ సిన్హాకు ఉందని కేసీఆర్ చెబుతున్నారు. రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి, వివిధ పదవుల ద్వారా దేశానికి సేవలందించిన సిన్హాకు విశేషమైన అనుభవం ఉందని, రాష్ట్రపతి పదవికి ఆయన అన్నివిధాలా అర్హులని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
కాకపోతే కేసీఆర్ చెప్పినట్లుగా ఇప్పటిరోజుల్లో మనస్సాక్షి ప్రకారం, ఆత్మప్రబోధానుసారం ఓటువేసేవారు లేరని చెప్పవచ్చు. పార్టీ అధినేతలు చెప్పినట్లుగా ఓటువసి తమ విధేయతను చాటుకోవడమేకానీ అభ్యర్థుల చరిత్రను చూసి ఓటువేసేవారు లేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications