ప్రఖ్యాత ఆలయంలో ఇళయరాజాకు అవమానం..!!
Ilayaraja: జగత్తు మెచ్చిన సంగీత దిగ్దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజాకు ఘోర అవమానం ఎదురైంది. తమిళనాడులోని ఓ ప్రఖ్యాత ఆలయంలో ఈ ఘటన సంభవించింది. ఆయనను అర్థమండపంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు ఆలయ అర్చకులు. లోనికి వచ్చిన ఆయనను బయటికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. బయటే ఉండాలనీ సూచించారు.
తమిళనాడు విరుధ్‌నగర్ జిల్లాలోని శ్రీవిల్లిపుత్తూరులో గల శ్రీ ఆండాళ్ సమేత శ్రీరంగమన్నార్ స్వామివారి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. ఇదొక ఆధునిక అంటరానితనంగా మండిపడుతున్నారు. అత్యున్నత శిఖరాలను అందుకున్న ఇళయరాజాపై కుల వివక్షను చూపించడాన్ని తప్పుపడుతున్నారు.

తమిళనాడు దేవాదాయ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి మేరకు శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయాన్ని సందర్శించారు ఇళయరాజా. గర్భగుడి ముందున్న అర్థమండపంలోకి అడుగుపెట్టారు. ఆ వెంటనే ఆయనను అడ్డుకున్నారు. అర్థమండపం గుమ్మం బయట ఉండాలని ఆదేశించారు.
దీనితో వెనక్కి మళ్లారు ఇళయరాజా. ఆ సమయంలో అర్చకులతో ఎలాంటి వాగ్వివాదానికి దిగలేదు. వాళ్లు సూచించినట్టుగా గుమ్మం దాటి వెలుపలికి వచ్చారు. అక్కడే నిల్చున్నారు. అక్కడే ఉండి శ్రీ ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయన సత్కరించారు. పూలమాల వేశారు. పట్టువస్త్రాలను తలపాగాగా చుట్టారు. తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఇళయరాజా రంగమన్నార్ స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఎక్కువసేపు ఆయన అక్కడ గడపలేదు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 45 సంవత్సరాలుగా సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ఇళయరాజాకు అవమానం జరిగిందంటూ నెటిజన్లు భగ్గుమంటోన్నారు.

ఇళయరాజాకు అవమానం జరిగిందనడాన్ని ఆలయ అర్చకులు తోసిపుచ్చుతున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం అర్థమండపం లోపలికి ఎవరూ వెళ్లకూడదని చెప్పారు. ఇదే విషయాన్ని ఇళయరాజాకు వివరించాయని, ఆయన అర్థం చేసుకుని బయటే నిల్చున్నారని వివరించారు.
శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందీ దివ్యధామం. విష్ణుమూర్తికి అంకితం చేన 108 దివ్యదేశాల్లో ఇదీ ఒకటి. ఈ ఆలయం మధురైకి 80 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ ఆలయాన్ని. అత్యంత ప్రాచీనమైనది. తొమ్మిదవ శతాబ్దంలో 12 మంది ఆళ్వార్లు రచించన 4,000 నాళయిర దివ్య ప్రబంధాల్లో ఈ ఆలయం ప్రస్తావన ఉంది.












Click it and Unblock the Notifications