అతి భారీ వర్షాలు- ఆరెంజ్ అలర్ట్ జారీ
Heavy rains: తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక జిల్లాలు ముంపునకు గురయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రదేశాలకు తరలించింది. వారికోసం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. కేరళపైనా దీని ప్రభావం పడింది.
మొన్నటివరకు మిఛౌంగ్ తుఫాన్ బారిన పడ్డ తమిళనాడు.. ఇప్పుడు మరోసారి అల్పపీడనాన్ని ఎదుర్కొంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు దక్షిణప్రాంతంలోని అనేక జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. వీధులన్నీ జలమయం అయ్యాయి.

తిరునెల్వేలి, కన్యాకుమారి, నాగపట్నం, తూత్తుకుడి జిల్లాలు కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి- తిరునెల్వేలిపై వర్షాల తీవ్రత అధికంగా పడింది. శనివారం ఉదయం 8:30 గంటల నుంచి ఈ ఉదయం 8:30 గంటల వరకు తిరునెల్వేలి జిల్లాలో 204 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
తిరునెల్వేలి జిల్లాలోని నెలముత్తు-190, ఊత్తు- 170, కక్కాచి- 152, మంజొలై- 135, రాధాపురం- 55, అంబసముద్రం- 49 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. కన్యాకుమారిలో 11 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు చెన్నైలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలోని రిజర్వాయర్లన్నీ వరదనీటితో పోటెత్తుతున్నాయి.

వచ్చే 24 గంటల్లో వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆయా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరింపజేసింది.

ఈ వర్షాల తీవ్రత అటు కేరళపైనా పడింది. తమిళనాడుతో సరిహద్దులను పంచుకుంటోన్న జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయిదు జిల్లాల్లో వచ్చే 48 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది.












Click it and Unblock the Notifications