Credit Card : క్రెడిట్ కార్డు బిల్లు కంటే ఎక్కువ కడుతున్నారా ? అయితే ఇది మీ కోసమే..!
క్రెడిట్ కార్డు వినియోగించే వారు సదరు బ్యాంకు ఇచ్చే గడువు లోపు బిల్లు చెల్లింపులు చేస్తుంటారు. ఓసారి బిల్లు జనరేట్ అయిన తర్వాత కస్టమర్ కు బిల్లు పూర్తి మొత్తం లేదా కనీస మొత్తం చెల్లించేందుకు బ్యాంకులు అవకాశం ఇస్తాయి. మొత్తం బిల్లు చెల్లిస్తే సరి, లేకుంటే కనీస మొత్తం కూడా చెల్లించవచ్చు. అయితే ఇలా కనీస మొత్తం చెల్లించినప్పుడు మిగతా మొత్తాన్ని వడ్డీతో కలిసి వచ్చే నెల బిల్లులు వడ్డిస్తాయి. ఇందులో మరో అవకాశం కూడా కస్టమర్లు వాడుకుంటుంటారు.
క్రెడిట్ కార్డు బిల్లులో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ కూడా చెల్లిస్తుంటారు. ఇలా చెల్లించడం ద్వారా ఓ లాభం ఉందని వారు భావిస్తుంటారు. వచ్చే నెలలో తమకు ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు లేదా ఖర్చు చేయాలనుకున్నప్పుడు సదరు కార్డులో ఎక్కువ మొత్తం అందుబాటులో ఉంటే దాని ద్వారా ఖర్చుపెట్టేయవచ్చని అనుకుంటుంటారు. దీంతో బిల్లులో ఇచ్చిన పూర్తి మొత్తం కంటే ఎక్కువ మొత్తాలు చెల్లించేస్తున్నట్లు బ్యాంకులు తాజాగా గుర్తించాయి. అలాగే దీంతో మోసాలు కూడా జరుగుతున్నట్లు తేలింది.

ఈ నేపథ్యంలో బ్యాంకులు ఇలా తాము విధించిన బిల్లు కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తున్న కస్టమర్ల డేటాను సేకరించి విశ్లేషిస్తే ఇందులో మోసాలకు కారణమవుతున్న కార్డులు, విదేశీ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్న కార్డులు ఉన్నట్లు తేలింది. దీంతో ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తాము ఎంత మొత్తం బిల్లు విధిస్తే అంతే మొత్తం చెల్లించేలా తమ యాప్స్ లో నెట్ బ్యాంకింగ్ ప్లాట్ ఫామ్స్ పైనా మార్పులు చేస్తున్నాయి. అయినా ధర్డ్ పార్టీ యాప్స్, లేదా వాలెట్స్ ద్వారా అదనపు మొత్తం చెల్లించే వారి కోసం మరో ఆప్షన్ కూడా రెడీ చేశాయి.

బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు కస్టమర్లకు విధించే బిల్లు మొత్తం కంటే ఎక్కువ చెల్లిస్తున్న వారికి ఈ పేమెంట్ పూర్తయిన తర్వాత ఎంత ఎక్కువ చెల్లిస్తారో దాన్ని వారికి రిఫండ్ చేయాలని నిర్ణయించాయి. వారు ఏ రూపంలో ఈ పేమెంట్ చేశారో చూసుకుని దాని ద్వారానే తిరిగి వారికి సదరు ఎక్కువ మొత్తాన్ని రిఫండ్ చేయబోతున్నాయి. తద్వారా మోసాల్ని అరికట్టవచ్చని భావిస్తున్నాయి. కస్టమర్లను కూడా తాము విధించిన బిల్లు మొత్తాలు మాత్రమే చెల్లించేలా నిబంధనలు సిద్ధం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications