కరోనా విలయంలో అద్భుతం -కొవిడ్ యాంటీ బాడీస్‌తో తొలి శిశువు జననం -తల్లి వ్యాక్సిన్ తీసుకోగా
దాదాపు 16 నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారిపై యావత్ మానవాళి అవిశ్రాంతంగా పోరాడుతున్నది. రోజులు గడిచేకొద్దీ కొత్త వేరియట్ల రూపంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. దానికి విరుగుడుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఊపందుకుంది. ఈక్రమంలో ఓ అద్భుతంగా సంఘటన ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా కొవిడ్ యాంటీ బాడీస్‌తో ఓ శిశువు భూమిపై అడుగు పెట్టింది.

అమెరికాలో ఘటన..
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తోన్న ఓ మహిళ గర్భవతిగా ఉండి కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడం, ఆమె ప్రసవించిన శిశువు శరీరంలో పుట్టుకతోనే కొవిడ్-19 యాంటీ బాడీలు కలిగి ఉండటం ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. దీనిపై అమెరికా డాక్టర్లు ఓ ప్రకటన విడుదల చేశారు.

తల్లి టీకాతో బిడ్డకు అలా..
ఫ్లోరిడాకు చెందిన ఆరోగ్య కార్యకర్త 36 వారాల గర్భిణిగా ఉన్నప్పుడు మోడెర్నా వ్యాక్సిన్ తీసుకుంది. టీకా వేసుకున్న మూడు వారాల తర్వాత.. అంటే జనవరిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నవజాత శిశువు రక్త నమూనాలను సేకరించిన వైద్యులు వాటిని డీఎన్‌ఏ పరీక్షకు పంపారు. ఈ పరిశోధనలో శిశువులో కొవిడ్ యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు గుర్తించామని అక్కడి శిశు వైద్య నిపుణుడు డాక్టర్ పాల్ గిల్‌బర్ట్ పేర్కొన్నారు.

యాంటీ బాడీస్ ఎంతకాలం?
గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి టీకా తీసుకోవడం వల్లే ఆమెకు జన్మించిన బిడ్డలోనూ యాంటీ బాడీలు వృద్ధి చెందాయని, ఇటువంటి ఘటన ప్రపంచంలో తొలిసారిగా జరిగిందని డాక్టర్ గిల్‌బర్ట్ వివరించారు. అయితే, ఈ కొవిడ్ యాంటీ బాడీలు సదరు శిశువుకు ఎంతకాలం (వైరస్ నుంచి) రక్షణ కల్పిస్తాయన్నది తదుపరి అధ్యయనాల్లో తేలాల్సి ఉందని మరో వైద్యుడు డాక్టర్ చాడ్ రుడ్నిక్ తెలిపారు.












Click it and Unblock the Notifications