అహ్మద్ పటేల్ భవితవ్యానికి పరీక్ష: నేడే రాజ్యసభ ఎన్నికలు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో మంగళవారం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ను ఓడించి గట్టి షాక్‌ ఇవ్వాలని బీజేపీ, ఎలాగైనా గెలిచి దీటుగా జవాబు ఇవ్వాలని కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గుజరాత్‌లో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి.

బీజేపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, బల్వంత్‌సిన్హ్‌ రాజ్‌పుత్‌ (కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బీజేపీలో చేరారు), కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌ బరిలో ఉన్నారు. పటేల్‌ విజయానికి 45 మంది ఎమ్మెల్యేలు అవసరం. కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 44 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

నోటా ఆప్షన్‌తో అహ్మద్ పటేల్ ఓటమికి వ్యూహం

నోటా ఆప్షన్‌తో అహ్మద్ పటేల్ ఓటమికి వ్యూహం

మిత్రపక్షం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన రెండు ఓట్లపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకోగా చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ షాకిచ్చింది. బీజేపీకి ఓటేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ సీనియర్ నేత ప్రఫుల్‌ పటేల్‌ సూచించారు. అయితే కాంగ్రెస్‌కు మద్దతిస్తామని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే చెప్పడం గమనార్హం. మారిన పరిస్థితితో కాంగ్రెస్‌ ఇప్పుడు జేడీయూ, గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్‌ మాజీ నేత శంకర్‌సిన్హ్‌ వాఘేలా వర్గం ఎమ్మెల్యేలూ మద్దతిస్తారనే నమ్మకంతో ఉంది. ఈ ఎన్నికల్లో కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ చేయడంతోపాటు నోటా ఆప్షన్‌ను ఎంచుకుంటే పటేల్‌ ఓటమి ఖాయమని బీజేపీ అంచనా.

Vice-Presidential Election 2017 Update : Voting Counting
లెక్క తప్పిన కాంగ్రెస్ లెక్కలు

లెక్క తప్పిన కాంగ్రెస్ లెక్కలు

కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తితో గత నెల్లో వాఘేలా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం తెలిసిందే. గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలకు ప్రస్తుతం 176 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 121, కాంగ్రెస్‌కు 57 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్‌ బలం 51కి పడిపోయింది. వాఘేలా వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. దీంతో మిగిలిన 44 మంది ఎమ్మెల్యేల్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వారిని బెంగళూరు రిసార్టుకు తరలించింది.

వీరితోపాటు జేడీయూ, గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉండగా ఆ ఓట్లపైనే పటేల్‌ గెలుపు ఆధారపడింది. నిజానికి పటేల్‌ నామినేషన్‌ సమయంలో ఎన్సీపీ, జేడీయూ ఎమ్మెల్యేలు ఆయన వెంటే ఉన్నారు. వాఘేలా వర్గంలోని ఏడుగురు ఎమ్మెల్యేల్లో కొందరు తమకే ఓటేస్తారని కాంగ్రెస్‌ ఆశతో ఉంది. బీజేపీకి ఉన్న బలంతో రెండు స్థానాల్లో సులువుగా విజయం సాధిస్తుండగా.. మూడో అభ్యర్థికి ఆ పార్టీ వద్ద 31 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. విజయం సాధించాలంటే అభ్యర్థి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో నాలుగో వంతుతో పాటు అదనంగా ఒక ఓటు సాధించాలి.

మద్దతుపై వాఘేలా నర్మగర్భ వ్యాఖ్యలు

మద్దతుపై వాఘేలా నర్మగర్భ వ్యాఖ్యలు

తన గెలుపుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్‌ పటేల్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘44 ఓట్లు కాదు ఇంకా ఎక్కువే వస్తాయి. గెలవడానికి కావాల్సిన బలం మాకుంది. మా ఎమ్మెల్యేలపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను' అని చెప్పారు. ఎన్సీపీ, జేడీయూ ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతు ఇస్తారని పటేల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్‌ మాజీ నేత వాఘేలా మాత్రం తన వర్గం ఎమ్మెల్యేల మద్దతుపై దాటవేత ధోరణిలో మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకత్వంతో తానసలు టచ్‌లో లేనని, బీజేపీకి మద్దతుపై చర్చల్లో నిజం లేదన్నారు. ‘నేను ఎవరికి ఓటు వేస్తాననే విషయాన్ని చెప్పను. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు అనేది ఎమ్మెల్యేకి వ్యక్తిగత ఆస్తిలాంటిది' అని చెప్పారు. 1977 నుంచి అహ్మద్‌ పటేల్‌ తాను మంచి స్నేహితులం అని.. ఇప్పుడు కూడా ఆ బంధం అలాగే కొనసాగుతుందని, అది రాజకీయాలకు అతీతమని అన్నారు. గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత ఓటింగ్‌ జరగడం ఇదే తొలిసారి.

నిజానంద రిసార్ట్ బయట పోలీసులు

నిజానంద రిసార్ట్ బయట పోలీసులు

కొద్ది రోజులుగా బెంగళూరులోని ఈగల్‌టన్‌ రిసార్టులో మకాం వేసిన 44 మంది గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సోమవారం తెల్లవారుజామున అహ్మదాబాద్‌ చేరుకున్నారు. తర్వాత వారిని పొరుగునే ఉన్న ఆనంద్‌ జిల్లాలోని నిజానంద రిసార్ట్‌కు తరలించారు. రక్షాబంధన్‌ కోసం వారి కుటుంబ సభ్యులూ రిసార్ట్‌కు వచ్చారని, మంగళవారం ఓటింగ్‌ కోసం ఎమ్మెల్యేల్ని గాంధీనగర్‌కు తీసుకెళ్తామని కాంగ్రెస్‌ ప్రతినిధి మనీశ్‌ దోషి చెప్పారు. కాగా రిసార్టు లోపల పోలీసు రక్షణను ఎమ్మెల్యేలు తిరస్కరించడంతో వెలుపల బలగాల్ని మోహరించారు. ఎమ్మెల్యేలకు రక్షణగా రిసార్టులో కాంగ్రెస్‌ కార్యకర్తల్ని మోహరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AHMEDABAD:After a meeting with 44 legislators of his party at a resort in Anand, about 76 km from Ahemdabad, senior Congress leader Ahmed Patel said on Monday he is confident that he will be re-elected to the Rajya Sabha from Gujarat in elections today. Numbers show that Mr Patel's election could be touch and go.
Please Wait while comments are loading...